వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచకాలు సృష్టించడంతో ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. ఆయన చీపురుపల్లిలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ గాడి తప్పిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరిదిద్దుతూ, సామరస్య పాలన అందిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేయించడానికి కుట్రలు చేస్తున్నారన్నారు.
ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా జగన్మోహన్ రెడ్డికి నేర సంస్కృతి ఇంకా పోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రానివ్వకుండా విధ్వంసాలు సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో గృహనిర్బంధాలు, అక్రమ కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులు తప్ప ఇంకేమి సాధించలేదన్నారు. పోలీస్ వ్యవస్థను, చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతురన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు గేటు వద్ద పోలీసులపై ప్రవర్తించిన తీరును చూసి జగన్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించి రాష్ట్రానికి పెట్టుబడులు, నిధులు రాకుండా జగన్ కుట్ర పన్నుతున్నారన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, పోలవరం, రాజధాని నిర్మాణం చేయడం జగన్ కి ఏమాత్రం ఇష్టం లేదన్నారు. అసెంబ్లీకి వెళ్లడానికి ఇష్టం లేకే జగన్ రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తన వెనుక ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాపాడుకోవడానికే జగన్ ఇలా నిరసనలు అంటూ హడావుడి చేస్తున్నారన్నారు.