మక్కువ గ్రామంలో 53 లక్షల వ్యయంతో నిర్మించనున్న MEO కార్యాలయం కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. గ్రామస్థాయిలోనే విద్యా పరిపాలనను బలపడేలా, పాఠశాలలకు అవసరమైన సేవలు వేగంగా అందించేందుకు ఈ కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అధికారుల సమక్షంలో అందజేస్తారు. భూ రికార్డులు పారదర్శకంగా ఉండేలా, రైతుల భూ హక్కులు మరింత భద్రంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.
భూములపై రైతుల హక్కులను బలపరచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి తక్షణ పరిష్కారానికి అధికారులకు సూచనలు ఇచ్చారు.
జిల్లాలో మొత్తం 76,752 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
• పార్వతీపురం నియోజకవర్గం – 22,197 పాస్ పుస్తకాలు
• సాలూరు నియోజకవర్గం – 14,056 పాస్ పుస్తకాలు
• కురుపాం నియోజకవర్గం – 16,399 పాస్ పుస్తకాలు
• పాలకొండ నియోజకవర్గం – 24,100 పాస్ పుస్తకాలు
గత ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలపై తమ నాయకుడి ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకున్నారని మంత్రి విమర్శించారు.
ప్రజల హక్కులకు సంబంధించిన పత్రాలపై రాజకీయ ముద్ర వేయడం తగదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందజేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలపై కేవలం ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుందని తెలిపారు.
లబ్ధిదారుల భూమి వివరాలు సులభంగా తెలుసుకునేందుకు పాస్ పుస్తకాల్లో QR కోడ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి గారు పేర్కొన్నారు. ఇది పారదర్శకతకు నిదర్శనమని అన్నారు.
రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని రాష్ట్ర స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
మంత్రి సంధ్యారాణి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటోందని అన్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, ప్రజల సంక్షేమం ముందుంచుకుని ఇచ్చిన హామీలను అమలు చేస్తూ… రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని పేర్కొన్నారు.
గడిచిన ఐదేళ్లలో విద్యుత్ రంగం తీవ్రమైన అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొందని మంత్రి తెలిపారు. విద్యుత్ వ్యవస్థను అప్పుల బారిన పడేలా చేసిన నిర్ణయాల వల్ల ప్రజలే భారం మోయాల్సి వచ్చిందని చెప్పారు. విద్యుత్ అనేది రాజకీయ ఆయుధం కాదని — ప్రజల జీవితాలతో ముడిపడిన కీలక మౌలిక రంగమని మంత్రి వివరించారు.
బాధ్యతాయుత పాలన — చారిత్రాత్మక నిర్ణయాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు సంస్కరణలు చేపట్టిందని మంత్రి చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా — వేల కోట్ల విలువైన ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వం భరించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు.
1999లో ఏర్పడిన ఏపీఈఆర్సీ చరిత్రలోనే తొలిసారి ట్రూడౌన్ ఛార్జీలు నమోదు కావడం, ముఖ్యమంత్రి చేపడుతున్న సంస్కరణలకు నిదర్శనమని మంత్రి అన్నారు. ట్రూడౌన్ అమలు ద్వారా యూనిట్‌కు 13 పైసలు తగ్గడం ప్రజలకు నేరుగా లాభమని వివరించారు.
రైతులకు – వినియోగదారులకు నేరుగా లాభం
అక్వా రైతులకు గతంలో యూనిట్ రూ.3.50 వసూలు చేయగా, ఇప్పుడు యూనిట్ రూ.1.50కు తగ్గించడం రైతులకు పెద్ద ఉపశమనమని సంధ్యారాణి గారు తెలిపారు. గతంలో రూ.5.19కు విద్యుత్ కొనుగోలు చేస్తే, ఇప్పుడు రూ.4.70కు తక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల బరువు తగ్గిందని చెప్పారు.
రిన్యూవబుల్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తూ — సోలార్ పవర్ వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్‌లు, బీసీ వర్గాలకు కేంద్ర సబ్సిడీతో పాటు అదనంగా రూ.20 వేల ప్రత్యేక సబ్సిడీ అందించడం ద్వారా కుటుంబాలపై ఖర్చు తగ్గుతుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు.













