గరివిడి రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.
గరివిడి, అక్టోబర్ 26. గరివిడి పాత రైల్వే గేట్ ప్రాంతంలో అండర్ ట్రాక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 150 కుటుంబాలు వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాలను నిర్వహించి దశాబ్దాలుగా జీవనం గడుపుతున్నారని, ఇక్కడి రైల్వే ట్రాక్ ఇరువైపులా దారిని మూసివేసి రహదారిని స్తంభింప చేయడంతో ఇరువైపులా దాదాపు 22 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోవడంతో, తమ వ్యాపారాలు పడిపోయాయని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి పాత రైల్వే గేటు ప్రాంతంలో, ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగిన తర్వాత, గరివిడి పట్టణం రెండుగా చీలిపోయిందని, కొద్దిరోజుల క్రితం వరకు క్రింద ట్రాక్ మార్గంలో నడకదారి ఉండేదని, తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్న అభిప్రాయంతో ఆ దారిని కూడా పూర్తిగా రైల్వే శాఖ అడ్డు గోడ నిర్మించి మూసివేయడంతో, అటు గ్రామాల ప్రజలు ఇటు, ఇటు గ్రామాల ప్రజలు అటు, రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయని స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార,వర్తక, ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడుని కలిసి, రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన రామ్ మల్లిక్ నాయుడు, స్థానిక రైల్వే గేట్ ప్రాంతాన్ని పరిశీలించి స్థానిక శాసనసభ్యులు, ఇతర పెద్దలు, దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాగా కొండనాలికకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా, గరివిడి రైల్వే గేటు సమస్యను పరిష్కరించడానికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే, పట్టణం రెండుగా చీలిపోయి, ఇరువైపు గ్రామాల రాకపోకలు స్తంభించిపోయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఇరువైపులా ఇరుకైన రోడ్లు అవ్వడంతో , రెండు వైపులా భారీ వాహనాలు, లారీలు, బస్సులు, వంటి వాహనాలతో తరచూ ట్రాఫిక్ స్తంభించిపోతున్నదని అన్నారు. రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే ఇక్కడి స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల, సమస్యను పరిష్కరించినట్లు అవుతుందని, ఈ సమస్యపై స్థానిక శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు, పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితర నేతల దృష్టికి ఈ సమస్యను తీసుకెళతామని స్థానిక వర్తక వ్యాపార ప్రతినిధులు అన్నారు.