పార్వతీపురం / పాచిపెంట, అక్టోబర్ 27 : ప్రకృతి ఎంతటి భీకర రూపాన్ని దాల్చినా, అంకితభావం ఉన్న అధికార యంత్రాంగం ఉంటే ఆ గండం గట్టెక్కడం పెద్ద కష్టమేం కాదు. “అర్నబ్” తుఫాన్ ఉధృతికి పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం వణుకుపోతున్న తరుణంలో, అక్కడ జరిగిన ఒక సంఘటన అధికారుల సమయస్ఫూర్తికి, కర్తవ్య దీక్షకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
*పెనుముప్పుగా మారిన మహా వృక్షం*
తుఫాన్ ప్రభావంతో వీస్తున్న తీవ్రమైన ఈదురుగాలులకు పి.కొనావలస – పాచిపెంట రహదారిపై (1/8 కి.మీ. మైలురాయి వద్ద) సుమారు 1.20 మీటర్ల భారీ చుట్టుకొలత కలిగిన ఒక మహా వృక్షం అకస్మాత్తుగా వేర్లతో సహా నేలకూలింది. రోడ్డుకు అడ్డంగా పడిన ఆ భారీ చెట్టు కారణంగా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తింది.
*కంట్రోల్ రూమ్ అప్రమత్తత.. నిమిషాల్లో స్పందన*
ఈ ప్రమాదంపై పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చిన వెంటనే, అప్రమత్తమైన సిబ్బంది క్షణమాత్రంలో ఆర్ అండ్ బి (R&B) అధికారులకు సమాచారం అందజేశారు. అధికారుల మరియు సిబ్బంది తక్షణమే స్పందించి రంగంలోకి దిగారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఆధునిక పరికరాలను ఉపయోగించి ఆ మహా వృక్షాన్ని ముక్కలుగా చేసి తొలగించారు. సమాచారం అంది అందిన క్షణం నుండి కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే రోడ్డును పూర్తిగా క్లియర్ చేసి, మళ్లీ యథావిధిగా రాకపోకలను పునరుద్ధరించారు.
పెను తుఫాన్ భయపెడుతున్న వేళ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ సమన్వయంతో ఆర్ అండ్ బి అధికారులు చూపిన ఈ చొరవ, బాధ్యతాయుతమైన సేవాభావం ఆ ప్రాంత ప్రజల ప్రశంసలను అందుకుంది. అధికారుల సత్వర చర్యే ఈ ఆపద సమయంలో ఒక గొప్ప విజయంగా నిలిచింది.
