విజయనగరం, సెప్టెంబరు 21:
సామాజిక చైతన్యానికి, మానవతా విలువలకు, సంస్కరణ భావాలకు సాహిత్యాన్ని వేదికగా మలిచిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి వేడుకలు సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు.

గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రముఖ సాహితీవేత్తలు గురజాడకు ఘన నివాళులర్పించారు.

కార్యక్రమానికి సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు, అధ్యాపకుడు, రచయిత డాక్టర్ జి.వి.ఎస్. జయపాల్‌రావు, సాహితీ స్రవంతి జిల్లా ఉపాధ్యక్షుడు, సహాయ కార్యనిర్వహణ ఇంజినీర్ శ్రీ కె. శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, రచయిత శ్రీ బాల సుధాకర్ మౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న సాహితీ సమ్మేళనం గోడ పత్రికను అతిథులు ఆవిష్కరించారు.

కళాశాల సంచాలకుడు డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి గురజాడ అందించిన సేవలను, సమాజ సంస్కరణ కోసం ఆయన చేసిన కృషిని వివరించారు. అప్పట్లో బాలికలు, మహిళలు ఎదుర్కొన్న సామాజిక సమస్యలను గురజాడ తన రచనల ద్వారా సమాజం ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. మహిళల పట్ల గౌరవం, సమానత్వం, మానవీయ దృక్పథం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు.

“గురజాడను స్మరించుకోవడం అంటే ఆయన రచనలను చదవడమే కాదు.. ఆయన ఆశించిన సమాజాన్ని నిర్మించేందుకు మన వంతు బాధ్యతను నిర్వర్తించడం” అని డాక్టర్ శశిభూషణరావు పేర్కొన్నారు. బాలికలు, మహిళలను గౌరవించడం, వారి భద్రతకు తోడ్పడడం, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేయడం వంటి అంశాలపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎం.వి. సాయి దేవమణి మాట్లాడుతూ గురజాడ రచనలు నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థులు గురజాడ సాహిత్యాన్ని చదివి, ఆయనలోని సామాజిక చైతన్యం, మానవతా దృక్పథాన్ని అలవరచుకోవాలని సూచించారు.

డాక్టర్ జి.వి.ఎస్. జయపాల్‌రావు మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం గురజాడ తన రచనలను శక్తివంతమైన సాధనంగా మలిచారని తెలిపారు. ‘కన్యాశుల్కం’, ‘ముత్యాల సరాలు’ వంటి రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో ఆయన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని వివరించారు.

శ్రీ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ గురజాడ సాహిత్యంలో సామాజిక చైతన్యం, మానవీయ విలువలు ప్రతిఫలిస్తాయని అన్నారు. గురజాడ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

శ్రీ బాల సుధాకర్ మౌళి మాట్లాడుతూ గురజాడ రచనా శైలి, సరళమైన భాష, సామాజిక దృక్పథం తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయని తెలిపారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకుని సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు గురజాడ జీవితం, సాహిత్య సేవలు, సామాజిక సంస్కరణలపై ప్రసంగాలు చేశారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చర్చా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు.

గురజాడ జయంతి వేడుకలు విద్యార్థుల్లో తెలుగు సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు సామాజిక బాధ్యత, మానవీయ విలువలు, మహిళల పట్ల గౌరవం వంటి అంశాలపై చైతన్యాన్ని కలిగించాయి.

కార్యక్రమంలో కళాశాల జాతీయ సేవా పథకం కార్యక్రమ అధికారి శ్రీ బి. సూరపు నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి