డోలి రహిత రోడ్ల నిర్మాణంలో నాణ్యత, పారదర్శకత పాటించాలి.అన్ని చోట్ల పనులు జరగాలి.అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి

పార్వతీపురం, ఫిబ్రవరి 24 : జిల్లాలో చేపట్టిన డోలి రహిత రోడ్ల నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యత, పారదర్శకతతో పనులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మొత్తం మంజూరు చేసిన 81 డోలి రోడ్ల పనులు కూడా జరగాలని, ప్రారంభం కాని రోడ్లు ఉంటే, వెంటనే ప్రారంభించాలన్నారు. ఇప్పటివరకు 50 రోడ్ల పనులు గ్రౌండింగ్ అయ్యాయని, మిగిలిన పనులన్నీ ఈరోజే ప్రారంభం కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ నందు నమోదు చేయాలని, పనులు పూర్తయ్యేవరకు బిల్లులు వేచి ఉంచారాదని హితవు పలికారు. ఈ నెలాఖరులోగా రోడ్లు పూర్తయ్యేలా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసేలా ఈఈలు, ఏఈలు బాధ్యత వహించాలన్నారు. జిల్లాలోని డోలి రహిత రోడ్ల నిర్మాణ పనులపై సబ్ కలెక్టర్లు, డ్వామా పీడీ, ఎంపీడీఓలు, ఈఈలు, ఏఈలతో జిల్లా కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోడ్డు పనికి సంబంధించి పని ప్రారంభించకముందు, పని జరుగుతున్నప్పుడు, పని పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఫోటోలు తీసి ఉంచాలని స్పష్టం చేశారు. ఏఈలు రోజువారీ ప్రగతిని పర్యవేక్షిస్తూ, వారంతపు నివేదికలను ఫోటోలతో సహా సమర్పించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఏఈ నుండి ఈఈ వరకు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈఈలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి రోడ్డును వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తద్వారా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంటుందని, సమీక్షా సమావేశాల్లో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. మంజూరైన రోడ్ల విషయంలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా వెంటనే సరిచేసుకోవాలని, కేవలం అవసరమైన రోడ్లు మాత్రమే వేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. రేపటి నుండి ఈఈలు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్లు ఇంజినీర్లతో, ఎంపీడీఓలతో సమీక్షలు జరపాలని, ప్రగతి కనిపించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఈఈలు, ఏఈలు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి