మహిళల భద్రత, సైబర్‌ వేధింపులపై విద్యార్థులకు అవగాహన.. ఫిర్యాదులపై తక్షణ స్పందనకు భరోసా

సాలూరు, జనసేన పత్రిక ప్రతినిధి: కళాశాల ప్రాంగణాల్లో ర్యాగింగ్‌, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు ఏమాత్రం తావులేదని సాలూరు టౌన్‌ పోలీసులు స్పష్టం చేశారు. విద్యార్థి దశలో సరదా పేరుతో చేసే వేధింపులు భవిష్యత్తును ప్రభావితం చేసే నేరాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సాలూరు పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాలలో బుధవారం యాంటీ ర్యాగింగ్‌, మహిళా భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు ర్యాగింగ్‌ వల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాలతో పాటు చట్టపరమైన పరిణామాలను వివరించారు. ర్యాగింగ్‌కు పాల్పడటమే కాకుండా దానికి ప్రోత్సాహం ఇవ్వడం, సహకరించడం లేదా పరోక్షంగా పాల్గొనడం కూడా చర్యలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. కళాశాలలో ఎక్కడైనా ర్యాగింగ్‌ ఘటనలు చోటుచేసుకుంటే మౌనం వహించకుండా వెంటనే కళాశాల యాజమాన్యం లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్‌, వెంటపడటం, బెదిరింపులు, అసభ్యకర సందేశాలు, సోషల్‌ మీడియా ద్వారా వేధింపులు వంటి అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల పట్ల గౌరవం, బాధ్యతాయుతమైన ప్రవర్తన ప్రతి విద్యార్థిలో ఉండాలని సూచించారు.

ప్రస్తుతం డిజిటల్‌ వేదికల వినియోగం పెరిగిన నేపథ్యంలో సోషల్‌ మీడియా ఖాతాలు, ఫొటోలు, వ్యక్తిగత సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇతరుల ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వినియోగించడం, అసభ్యకరంగా ప్రచారం చేయడం వంటి చర్యలు చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరించారు.

విద్యార్థులకు ఎదురయ్యే వేధింపులు లేదా ఇతర సమస్యలపై భయపడాల్సిన అవసరం లేదని, పోలీసులను ఆశ్రయిస్తే సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కళాశాలలను ర్యాగింగ్‌ రహిత, సురక్షిత వాతావరణంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం సమన్వయంతో పనిచేయాలని కోరారు.

కార్యక్రమంలో కళాశాల యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి