ఘనంగా RTI జై ఆంధ్రా జై భారత్ సమాచార హక్కుల సంఘం 6వ వార్షికోత్సవ వేడుకలు
ముఖ్య అతిథిగా రాష్ట్ర RTI కమిషనర్ పి.ఎస్. నాయుడు.. ప్రత్యేక అతిథిగా డాక్టర్ అనిత జ్యోతి
విజయవాడ, నవంబర్ 27:
RTI జై ఆంధ్రా జై భారత్ (సమాచార హక్కుల సంఘం) 6వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 24వ తేదీన విజయవాడలోని GRT హోటల్స్‌లో ఘనంగా నిర్వహించారు. సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు, అధికారులు, సామాజిక సేవకులు, సంఘం ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కుల కమిషనర్ శ్రీ పి.ఎస్. నాయుడు, మరో ముఖ్య అతిథిగా మాజీ ఐ ఐ ఎస్ అధికారి శ్రీ జి. కొండలరావు హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా ప్రముఖ శ్వాస ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అనిత జ్యోతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనిత జ్యోతి మాట్లాడుతూ సమాజంలో మహిళల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజాసేవ, సామాజిక బాధ్యతతో పనిచేసే సంస్థలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర RTI కమిషనర్ పి.ఎస్. నాయుడు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం–2005 ప్రజలకు కల్పించిన గొప్ప ఆయుధమని, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ హక్కులపై అవగాహన పెంచుకుని చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మహిళల సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ సుదీర్ఘకాలంగా చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ గతంలో ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఆరు సంవత్సరాలుగా సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సామాజిక సమస్యలపై స్పందించడం, ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేయడం వంటి కార్యక్రమాలను సంఘం నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు.
వేడుకల్లో భాగంగా ప్రముఖుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణలు, సంఘం ప్రతినిధులకు సత్కారాలు, అభినందన కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు మహిళలు, యువత, సామాజిక కార్యకర్తలు, సంఘం సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఆరు సంవత్సరాల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న RTI జై ఆంధ్రా జై భారత్ సమాచార హక్కుల సంఘం భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలతో ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.

