రహదారి భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్ట చర్యలు
విద్యాసంస్థలు, వసతి గృహాలు, మెడికల్ షాపులపై నిరంతర పర్యవేక్షణ
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా
ఆపరేషన్ త్రిశూల్, ఎన్కార్డ్ కార్యక్రమాలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష
పార్వతీపురం మన్యం, నవంబర్ 27: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణతో పాటు గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ రెడ్డి ఆదేశించారు.
శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రహదారి భద్రత, ఆపరేషన్ త్రిశూల్, ఎన్కార్డ్ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ట్రాఫిక్ నిబంధనల అమలు, వాహనాల తనిఖీలు, ఎన్డీపీఎస్ కేసులు, నిందితుల అరెస్టులు, మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై ఇష్టానుసారంగా వాహనాలు నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపేలా అవగాహన కల్పించాలన్నారు. రహదారులకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు, పొదలను తొలగించి ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు అమర్చిన లైట్లు, అనధికారిక మార్పులు, అధిక శబ్దం చేసే హారన్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్, క్రేన్ వంటి అత్యవసర సేవలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రస్తుతం మానాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ఈ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థుల వసతి గృహాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూనియర్ కళాశాలల్లో ఈగల్ క్లబ్బులను చురుకుగా పనిచేయిస్తూ విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ప్రతి కళాశాలకు ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని, మాదకద్రవ్యాల వినియోగంపై అనుమానాలు ఉన్న సందర్భాల్లో అవసరమైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించాలని తెలిపారు. ఏఎన్ఎంల ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవర్తన, హాజరు, విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిపుణులతో అవగాహన కార్యక్రమాలు, ప్రసంగాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మెడికల్ షాపులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి నిబంధనల అమలును పరిశీలించాలన్నారు.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం, గంజాయి అక్రమ విక్రయాలు, సరఫరా వ్యవస్థలపై నిఘా పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 14 మంది వ్యక్తులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇతర ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
పునరావృత నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు, వారి నెట్వర్క్లపై ప్రత్యేక నిఘా ఉంచి గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టాలని సూచించారు.
రహదారి భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు అమలు చేయాలని కలెక్టర్, ఎస్పీ స్పష్టం చేశారు.
