శిక్షణద్వారా నైపుణ్యాభివృద్ది
జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
మెగా జాబ్‌మేళాకు అపూర్వ స్పందన
భోగాపురం, (విజయనగరం), సెప్టెంబరు 18 ః
నిరుద్యోగ యువతకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని వృద్దిచేసి, తద్వారా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి, స్థానిక భోగాపురం మండలం మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థవద్ద బుధవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన వ్యక్తమయ్యింది. యువతీయువకులు భారీ సంఖ్యలో ఈ మేళాకు హాజరయ్యారు.
జాబ్ మేళా ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య అతిధిగా హాజరై యువతకు దిశానిర్ధేశం చేశారు. ప్రతీ ఒక్కరూ ఉన్నత స్థానాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కష్టపడి పనిచేయడం ద్వారా దానిని సాధించాలని కోరారు. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. జీవితంలో కష్టపడినప్పుడే మెరుగైన ఫలితాలను సాధించవచ్చునని స్పష్టం చేశారు. ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం గొప్ప కార్యక్రమంగా పేర్కొన్నారు. సుమారు 2,500 మందిని ఈ మేళా ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. తగినంత నైపుణ్యం లేకపోవడం వల్లే మన ప్రాంతంలో యువత కొంత వెనుకబాటుకు గురవుతున్నారని, నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారి సామర్ధ్యానికి పదును పెట్టేందుకు కృషి చేస్తామన్నారు. స్థానికంగా ఉన్న కంపెనీలు స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. ఉద్యోగాలకు ఎంపికైన యువత, కష్టపడి పనిచేయడం ద్వారా జిల్లాకు మంచిపేరు తేవాలని కలెక్టర్ సూచించారు.
నెల్లిమర్ల ఎంఎల్ఏ లోకం నాగమాధవి మాట్లాడుతూ, 5 ఏళ్లలో 20 లక్షలమందికి ఉద్యోగాలను కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం ద్వారా తొలిఅడుగు వేస్తున్నామని అన్నారు. మౌలిక వసతులను కల్పించడం, యువతకు ఉద్యోగాలను కల్పించడం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి కషి చేస్తామని చెప్పారు. అలాగే మహిళలు, మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. చదువురాని వారికి కూడా ఫుడ్‌పార్కులు, అపేరల్ పార్కుల ద్వారా ఉపాధి కల్పించాలని సూచించారు. జాబ్ మేళాలను నిర్వహించడంతోపాటు, నైపుణ్యాభివృద్దికి కూడా కృషి చేస్తామన్నారు. కేవలం ఆహార ఉత్పత్తులను విక్రయించేవారికే కాకుండా, ఆ పంట పండించిన రైతులకు కూడా లాభాలను అందించాలన్నది తమ లక్ష్యమన్నారు. ప్రతీ కుటుంబానికి కనీసం రూ.25వేలు ఆదాయం ఉండాలన్నారు. భోగాపురం విమానాశ్రయం శరవేగంగా నిర్మాణం జరుగుతోందని, ఇది పూర్తయితే ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని ఎంఎల్ఏ మాధవి ఆకాంక్షించారు.
కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణచక్రవర్తి, జిల్లా నైపుణ్యాధికారి గోవిందరావు, ఉపాధి అధికారి డి.అరుణ, తాశిల్దార్లు తాడ్డి గోవింద, ఎం.సురేష్, సిడాప్ జెడిఎం మార్టిన్, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిఇఓ లోకం ప్రసాద్, డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ బెహరా, డీన్ శ్రీనివాస్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు