తండ్రి బాటలో కొడుకు…
కామన్వెల్త్‌లో అజయ్ బాబు సిల్వర్ సంచలనం.!

2010లో తండ్రి శ్రీనివాసరావుకు బ్రాంజ్.. 2026లో కుమారుడు అజయ్‌కు సిల్వర్

149 కేజీల స్నాచ్‌తో కామన్వెల్త్ గేమ్స్ రికార్డు.. 330 కేజీలతో రజత పతకం

కోచ్‌గా తండ్రి.. ఇండియన్ ఆర్మీలో హవల్దార్‌గా సేవలు.. కొండవెలగడ నుంచి గ్లాస్గో వరకు అజయ్ బాబు విజయగాథ

విజయనగరం/నెల్లిమర్ల:

ఒకే కుటుంబం.. రెండు తరాలు.. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు పతకాలు. తండ్రి సాధించిన అంతర్జాతీయ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, అదే క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్ బాబు.

గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో అజయ్ బాబు రజత పతకం సాధించాడు. స్నాచ్‌లో 149 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 181 కేజీలు ఎత్తి మొత్తం 330 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో అజయ్ బాబు సాధించిన 149 కేజీల లిఫ్ట్ కామన్వెల్త్ గేమ్స్ రికార్డుగా నిలిచింది.

అజయ్ బాబు విజయానికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అతని తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా భారతదేశానికి వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రాతినిధ్యం వహించారు.

2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీనివాసరావు బ్రాంజ్ మెడల్ సాధించారు. తండ్రి అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాన్ని దగ్గరుండి చూస్తూ పెరిగిన అజయ్ బాబు.. అదే క్రీడను తన కెరీర్‌గా ఎంచుకున్నాడు.

తండ్రి సాధించిన బ్రాంజ్ తర్వాత 16 ఏళ్లకు కుమారుడు కామన్వెల్త్ వేదికపై రజత పతకం సాధించడం వల్ల ఈ కుటుంబం పేరు మరోసారి అంతర్జాతీయ క్రీడా పటంలో మార్మోగింది.

అజయ్ బాబు విజయగాథలో అత్యంత కీలకమైన వ్యక్తి అతని తండ్రి వల్లూరి శ్రీనివాసరావు.

ఒకప్పుడు భారతదేశం తరఫున కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడిన శ్రీనివాసరావు.. ఇప్పుడు తన కుమారుడికి కోచ్‌గా మారి అతడిని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దారు.

శిక్షణలో తండ్రి అనుభవం.. పోటీల్లో అజయ్ బాబు పట్టుదల.. ఈ రెండూ కలసి అతడిని కామన్వెల్త్ పతకం సాధించే స్థాయికి తీసుకెళ్లాయి.

తండ్రి కోచ్‌గా.. కొడుకు అథ్లెట్‌గా కొనసాగిన ఈ ప్రయాణం ఇప్పుడు భారత క్రీడా రంగంలో ప్రత్యేకమైన తండ్రి-కొడుకు విజయగాథగా నిలిచింది.

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో అజయ్ బాబు అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

స్నాచ్‌లో తొలుత 145 కేజీల బరువును విజయవంతంగా ఎత్తిన అజయ్.. అనంతరం 149 కేజీలను ప్రయత్నించాడు. రెండో ప్రయత్నంలో విఫలమైనప్పటికీ, చివరి ప్రయత్నంలో అదే బరువును విజయవంతంగా ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పాడు.ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్‌లో 181 కేజీలు ఎత్తాడు.స్వర్ణ పతక విజేతతో కేవలం ఒక కేజీ తేడాతో అజయ్ బాబు రజతం సాధించాడు

తండ్రి శ్రీనివాసరావు అనుభవం, మార్గదర్శకత్వం అజయ్ కెరీర్‌కు బలమైన పునాదిగా మారింది. కఠోర శిక్షణ, నిరంతర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నాడు.
అథ్లెట్ మాత్రమే కాదు.. ఇండియన్ ఆర్మీ సైనికుడు

అజయ్ బాబు క్రీడా ప్రస్థానంతో పాటు దేశ సేవలోనూ కొనసాగుతున్నాడు.

2025 అక్టోబర్ 23న ఇండియన్ ఆర్మీలో చేరిన అజయ్ బాబు ప్రస్తుతం హవల్దార్ (HAV) ర్యాంక్‌లో సేవలందిస్తున్నాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ బైరాగఢ్ 3 EME Centreలో విధులు నిర్వహిస్తున్నాడు.

దేశానికి సైనికుడిగా సేవ చేస్తూనే.. అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తూ పతకాలు సాధించడం అజయ్ బాబు విజయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

2010లో న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో తండ్రి వల్లూరి శ్రీనివాసరావు బ్రాంజ్ మెడల్ సాధించారు.

16 ఏళ్ల తర్వాత 2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో అదే కుటుంబానికి చెందిన వల్లూరి అజయ్ బాబు రజత పతకం సాధించాడు.

అంతేకాదు.. తండ్రి సాధించిన పతకాన్ని అధిగమిస్తూ, అజయ్ బాబు తన కుటుంబ క్రీడా వారసత్వాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లాడు.

తండ్రి చేతిలో శిక్షణ.. దేశం కోసం ఆర్మీలో సేవ.. అంతర్జాతీయ వేదికపై భారత పతాకానికి గౌరవం..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి