విజయనగరం, ఏప్రిల్ 27: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లుగా వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ సమీక్షా సమావేశంలో భాగంగా జిల్లాలో ఇంధన సరఫరా పరిస్థితిపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 134 పెట్రోల్ బంక్ అవుట్‌లెట్లు ఉన్నాయని తెలిపారు. అందులో నాలుగు బంకులు తాత్కాలికంగా డ్రై అవుట్ అయినప్పటికీ, ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం లోపు వాటికి స్టాక్ చేరుకుంటుందని చెప్పారు. జిల్లాలో రోజువారీగా సగటున 713.2 కిలోలీటర్ల డీజిల్, 442 కిలోలీటర్ల పెట్రోల్ డిమాండ్ ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో 1022 కిలోలీటర్ల డీజిల్, 1069 కిలోలీటర్ల పెట్రోల్ నిల్వలు ఉన్నాయని, ఇవి సుమారు మూడు రోజుల అవసరాలకు సరిపోతాయని పేర్కొన్నారు.
సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడం వల్ల కొన్ని చోట్ల తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినట్లు గుర్తించామని, ఇకపై బంక్‌లలో 30 శాతం స్టాక్ మిగిలి ఉన్నప్పుడే ఆయిల్ కంపెనీలకు ఇండెంట్ పెట్టాలని కఠినంగా ఆదేశించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టి స్టాక్ తెప్పించే విధంగా చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.

*నిరంతర వినియోగదారులకు ఇబ్బంది పెట్టవద్దు*

ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చే సాధారణ ప్రజలు, రైతులు మరియు అగ్రికల్చర్ మోటార్ల కోసం ఇంధనం కొనుగోలు చేయడానికి వచ్చే వారికి వారికి అవసరమైన మేర ఇంధనం అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

*స్టాక్ ఉండి సరఫరా చేయకపోతే కఠిన చర్యలు*

పెట్రోల్ బంక్‌లలో స్టాక్ ఉన్నప్పటికీ వినియోగదారులకు సరఫరా చేయకుండా ఉంచినట్లయితే సంబంధిత యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే బల్క్ వినియోగదారుల కొనుగోళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

*నిరంతర పర్యవేక్షణ*

జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద నిరంతర పర్యవేక్షణ కోసం రెవెన్యూ మరియు పోలీస్ అధికారులను నియమించామని తెలిపారు. అదేవిధంగా రియల్ టైమ్‌లో స్టాక్ పర్యవేక్షణ జరగాలని, సంబంధిత ఆయిల్ కంపెనీలు మరియు డీలర్లు జేసి కార్యాలయం, జిల్లా పౌర సరఫరాల శాఖకు ఎప్పటికప్పుడు వివరాలు అందించాలని సూచించారు. అదేవిధంగా పౌర సరఫరా కార్యాలయంలో 7995635828 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.

డీలర్లకు ఆయిల్ సరఫరా మరియు క్రెడిట్ విషయాల్లో ఆయిల్ కంపెనీలు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని, ఆయిల్ కంపెనీలు తమ డిపోల ద్వారా సరఫరాను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజలు వదంతులకు లోనుకాకుండా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని, జిల్లాలో ఎటువంటి ఇంధన కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి