విజయనగరం పట్టణ శివార్లలోని నారాయణపట్నం వద్ద హత్యకు గురైన పావాడ హరనాధ్ (23సం.లు) మిస్టరీని విజయనగరం 1వ పట్టణ పోలీసులు చేధించి, హత్యకు కారకులైన నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు పంపడంతోపాటు, వారికి సహకరించిన మరో జువినల్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏప్రిల్ 24న నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వివరాలను వెల్లడించారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ – విజయనగరం పట్టణం జొన్నగుడ్డికి చెందిన పావాడ సంతోషి అనే ఆమె 1వ పట్టణ పోలీసులకు తే. 10-04-2026 దిన ఫిర్యాదు చేస్తూ తన కుమారుడు పావాడ హరనాధ్ (23 సం.లు) అనే వ్యక్తి తే. 27-03-2026 ది రాత్రి నుండి కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా 1వ పట్టణ పోలీసులు మిస్సింగు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారన్నారు. ఇదే క్రమంలో విజయనగరం మండలం నారాయణ పురం గ్రామ శివార్లలోని నూతిలో ఒక వ్యక్తి శవంను సిమెంట్ పోల్ కు తాళ్ళతో కట్టి, శవంపై ఫ్లెక్సీ కప్పి ఉన్నట్లుగా వచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమై, శవంను పరిశీలించి మిస్సింగు అయిన పావాడ హరనాధ్ గా గుర్తించారన్నారు. వెంటనే, మిస్సింగు కేసును హత్య కేసుగా మార్పుచేసి, 1వ పట్టణ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి దర్యాప్తు చేపట్టారన్నారు.

విచారణలో మరణించిన పావాడ హరనాథ్ పై రౌడీషీటు ఉన్నట్లు, అతడిపై ఇప్పటికే 15 క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్నారు. ఇటీవల జొన్నగుడ్డిలో ఆదిపత్య పోరులో భాగంగా పావాడ హరనాధ్ కు, అదే ప్రాంతంలో ఉంటున్న బాక్సర్ (ఎ-1) సొంటేన లక్ష్మణరావు అలియాస్ లక్ష్మణకు గొడవ జరగగా, ఇరువురు కొట్లాడుకోవడం జరిగిందన్నారు. అనంతరం, పావాడ హరనాధ్ తాను బాక్సర్ లక్ష్మణరావును కొట్టినట్లుగా ఎక్కువగా ప్రచారం చేయడంతో అతడిపై పగతో ప్రతీకారం తీర్చుకోవాలని బాక్సర్ సొంటేన లక్ష్మణరావు భావించి, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా డన్నారు. ఇదే క్రమంలో బార్లో మద్యం సేవించి, మత్తులో బార్ బయట పడిపోవడంను గమనించిన (ఎ-1) సొంటేన లక్ష్మణరావు (30 సం.లు) మరియు అతడి వర్గానికి చెందిన (ఎ-2) కుప్పిలి భార్గవ కుమార్ అలియాస్ భార్గవ్ (20సం.లు), (ఎ-3) మచ్చ తేజ (20సం.లు మరియు సస్పెక్ట్ షీటు హెూల్టర్) మరియు (ఎ-4) రేగిడి వాసుదేవ్ అలియాస్ వాసు (26సం.లు) ఆటోలో లక్ష్మణరావును ఆటోలో పట్టణ శివార్లలోకి తరలించి, అక్కడ రాళ్ళతో కొట్టి హత్య చేసి, శవంను సిమెంట్ పోల కు తాళ్ళతో కట్టి, ఫ్లెక్సీ కప్పేసి పరారయ్యారన్నారు. ఇదే కేవలం ఇరు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరుతో జరిగిన హత్యని అన్నారు. ఈ కేసులో పావాడ హరనాధ్ ను హత్య చేసిన (ఎ-1) సొంటేన లక్ష్మణరావు అలియాస్ లక్ష్మణ (30సం.లు), (ఎ-2) కుప్పిలి భార్గవ కుమార్ అలియాస్ భార్గవ్ (20సం.లు), (ఎ-3) మచ్చ తేజ (20సం.లు మరియు సస్పెక్ట్ షీటు హెూల్టర్) మరియు (ఎ-4) రేగిడి వానుదేవ్ అలియాస్ వాసు (26సం.లు)లను అరెస్టు చేసి, రిమాండుకు తరలించామన్నారు. అంతేకాకుండా, నిందితులకు సహకరించిన మరో జువినల్ ను కూడా అదువులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఈ నేరాన్ని నిరూపణ చేసేందుకు నేర స్థలం నుండి సిమెంట్ పోల్, త్రాడు, (ఎ-1) సొంటేన లక్ష్మణరావు ఆధార్ కార్డుతో కూడిన పర్సు, హత్యకు వినియోగించిన రాయి, మూడు సెల్ ఫోన్లు, రూ.840/-ల నగదును సీజ్ చేసామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

ఈ హత్య కేసు మిస్టరీని చేధించేందుకు విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో 1వ పట్టణ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్ఐలు బి.సురేంద్ర నాయుడు, వి.ఎల్.ప్రసన్న కుమార్, ఎస్.రవి, జి.కమల భార్గవ మరియు ఇతర పోలీసు సిబ్బందిని కృషిని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అభినందించారు. రౌడీ షీటరు హరనాధ్ శవంను తరలించుటలో అత్యుత్సాహం ప్రదర్శించి, ట్రాఫిక్ అంతరాయం కలిగించిన వారిపై కూడా కేసులు నమోదు చేసామని, వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఎస్.రాఘవులు, విజయనగరం 1వ పట్టణ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, 1వ పట్టణ ఎస్ఐలు బి.సురేంద్ర నాయుడు, వి.ఎల్.ప్రసన్న కుమార్, ఎస్.రవి, జి.కమల భార్గవ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి