యువత జీవితాలను నాశనం చేసే వ్యసనాలను క్రీడలతో దూరం చేయాలి
*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*

*మెగా వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*
*క్రీడాకారులకు క్రీడా జెర్సీలను ప్రధానం చేసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*
*ప్రజల సౌకర్యార్ధం వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*

విజయనగరం జిల్లా ఆండ్ర పోలీసు స్టేషను పరిధిలోని మెంటాడ జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఆండ్ర పోలీసుల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న మెగా వాలీబాల్ టోర్నమెంటును జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జూన్ 17న ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై, యువతను సన్మార్గంలో నడిపేందుకు, చెడు వ్యసనాలకు ఆకర్షితులకు కాకండా చేయాలనే లక్ష్యంతో వాలీబాల్ టోర్నమెంటును, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – జీవితాలను నాశనం చేసే వ్యసనాలను క్రీడలతో దూరం చేయాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగులో భాగంగా ఆండ్ర పోలీసులు రెండు రోజులపాటు మెగా వాలీబాల్ టోర్నమెంటును నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ టోర్నమెంటులో మండలానికి చెందిన 21 జట్లు పాల్గొంటున్నాయన్నారు. యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా, క్రీడలుపట్ల ఆకర్షితులయ్యే విధంగా చేసేందుకు ఈ మెగా వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామన్నారు. క్రీడల్లో ఉన్నతంగా రాణించడం వలన ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలోను, యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించడంలో రిజర్వేషను పొందవచ్చునన్నారు. క్రీడలను కెరీర్ గా ఎంచుకున్నా జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు మంచి అవకాశాలు ఉంటాయన్నారు. యువత ఉద్యోగాలను సాధించేందుకు ప్రయత్నాలు సాగించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. జీవితాలను నాశనం చేసే గంజాయి, మద్యం, బెట్టింగులకు దూరంగా ఉండాలన్నారు. మంచి విషయాలను తెలుసుకొనేందుకు ఇంటర్నెట్ వినియోగించుకోవాలని, క్షణికమైన ఆనందం కోసం రీల్స్, వీడియోలను చూస్తూ, సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. మంచిగా జీవిస్తూ, చట్టాన్ని గౌరవించే వారిని పోలీసుశాఖ ఎప్పుడూ గౌరవిస్తుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపట్ల మాత్రం పోలీసుశాఖ ఎప్పుడు కఠినంగానే వ్యవహరిస్తుందన్నారు. సైబరు మోసాలకు గురికావద్దని, మహిళలు, బాలల భద్రతకు ఎటువంటి విఘాతం కలిగించకుండా యువత నడుచుకోవాలన్నారు. మహిళలను గౌరవించాలని, మైనరు బాలికలను ప్రేమ పేరుతో వేధిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు.

అనంతరం, ప్రజల సౌకర్యార్థం, వారికి ఉచిత వైద్యం అందించేందుకు నిర్వహించిన వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ క్రీడా జెర్సీలను ప్రదానం చేసారు. వాలీబాల్ టోర్నమెంటును జిల్లా ఎస్పీ ప్రారంభించి, ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకొని, పోటీలను కాసేపు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తిలకించారు.

ఈ కార్యక్రమంలో బొబ్బిలి డిఎస్పీ ఆర్.గోవిందరావు, గజపతినగరం సిఐ సన్యాసినాయుడు, ఆండ్ర ఎస్ఐ సీతారాం, మానాపురం ఎస్ఐ కళాధర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి