సాంకేతిక నేరాలపై నిఘా పెట్టాలి-రేంజ్ ఐజిపి గోపీనాధ్ జట్టి న్యాయ-పోలీస్ వ్యవస్థల సమన్వయం అవసరం: ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎం.బబిత నేరాల నియంత్రణకు వినూత్న చర్యలు: జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజయనగరం జూలై 14: రెవెన్యూ, పోలీసు మరియు ఇతర ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో, సమిష్టి బాధ్యతతో పనిచేయడం వల్లే విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టరు అండ్ జిల్లా మేజిస్ట్రేట్ ఎస్.రామసుందర రెడ్డి, ఐఎఎస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో ఒకే తాటిపై పనిచేస్తున్నాయని అభినందించారు. అధికారులు ఇదే స్ఫూర్తిని మున్ముందు కూడా కొనసాగిస్తూ, జిల్లాను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సాంకేతిక నేరాలపై నిఘా పెట్టాలి: రేంజ్ ఐజిపి గోపీనాధ్ జట్టి ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం రేంజ్ ఐజిపి గోపినాధ్ జట్టి మాట్లాడుతూ రాబోయే 5 నుండి 10 ఏళ్లలో నేరాల సరళి పూర్తిగా మారిపోతుందని భవిష్యత్తులో 60 శాతం సైబర్, సోషల్ మీడియా నేరాలే ఉంటాయని హెచ్చరించారు. పోలీసు అధికారులు సాంకేతిక నైపుణ్యాలను, నూతన చట్టాలపై అవగాహనను పెంచుకోవాలని దిశా నిర్దేశం చేశారు. తాత్కాలిక ప్రతిష్ఠ కోసం కాకుండా పోలీసు వ్యవస్థ ప్రతిష్టను శాశ్వతంగా ఉండేలా పనిచేయాలన్నారు. న్యాయ-పోలీస్ వ్యవస్థల సమన్వయం అవసరం: ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎం.బబిత ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీమతి ఎం.బబిత గారు మాట్లాడుతూ, జిల్లాలో పోక్సో (POCSO) కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు . కోర్టు విధులను మరింత సులభతరం చేసేందుకు ‘కోర్టు లైజన్ అధికారులను’ నియమించాలని, సాక్షులకు సరైన రక్షణ కల్పించాలని మరియు నాన్ బెయిలబుల్ వారంట్లను సకాలంలో అమలు చేయాలని సూచించారు. నేరాల నియంత్రణకు వినూత్న చర్యలు: జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, మాట్లాడుతూ గత ఆరు నెలల్లో జిల్లా పోలీసు శాఖ సాధించిన ప్రగతిని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై దాడులు, గ్రేవ్ కేసులు మరియు రహదారి ప్రమాదాలు తగ్గాయన్నారు. మహిళల రక్షణ కోసం ‘శక్తి యాప్’ పై విస్తృత అవగాహన, గ్రామాల్లో రాత్రి బస చేసే ‘పల్లె నిద్ర’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ రూ.3.50 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశామని, నిందితులపై నిఘాకు ‘360 డిగ్రీస్ యాప్’, సిసి కెమెరాలు, డ్రోన్లను వాడుతున్నామని ఎస్పీ వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎక్సైజ్, రవాణ, ఆర్టీసి, మున్సిపాల్టీ, విద్యుత్, మహిళా శిశు సంక్షేమ శాఖ, మెడికల్ అండ్ హెల్త్ తదితర వివిధ శాఖల ముఖ్య అధికారులు, డిఎస్పీలు ఎస్. రాఘవులు, ఆర్.గోవిందరావు, పివివి నర్సింహారావు, ఎం. వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు ఇన్స్పెక్టర్లు మరియు ఎస్ఐలు పాల్గొన్నారు. ————————————— Spread the love టపా నావిగేషన్ జెడ్పీ ఛైర్పర్సన్ చిన్నశ్రీనుకు మాతృ వియోగం