ఆనందపురం, ఆగస్టు 6

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, *గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న AP Gen-Z WAR కార్యక్రమంలో భాగంగా, డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలలో జరిగిన అవకతవకలకు నిరసనగా భీమిలి నియోజకవర్గ పరిధిలోని వేములవలస జంక్షన్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.

ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు శ్రీ బంక సత్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో *విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ముఖ్య అతిథిగా మరియు మజ్జి సిరి సహస్ర పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ, డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగిన నియామకాలపై కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అర్హత లేకుండా ఉపాధ్యాయ నియామకాలు ఎలా జరిగాయో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

“స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే PET పోస్టుకు అవకాశం ఉండొచ్చు. కానీ అదే సర్టిఫికేట్ ఆధారంగా సోషల్, ఇంగ్లిష్ వంటి సబ్జెక్ట్ టీచర్ పోస్టులను ఎలా కేటాయించారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. దీనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి” అని చిన్న శ్రీను డిమాండ్ చేశారు.

డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్న ఆయన, ప్రతి అర్హుడికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి, మహిళా విభాగాల నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి