మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చెయ్యాలంటే ఎమ్మెల్యేగా కడుబండిని గెలిపించండి
- పార్టీ మారిన వారు పదవులు పట్టుకుని వేలాడటం ఎందుకు? – పదవులకు హుందాగా రాజీనామాలు చేయండి
- ముసుగులు తీసేసి తిరగండి..దాక్కుని కాదు
- ఎమ్మెల్సీ రఘురాజుపై మంత్రి బొత్స సెటైర్లు
- విజయనగరం జిల్లా -శృంగవరపుకోట :
త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యేగా కడుబండిని గెలిపించాలని మంత్రి బొత్స సత్యనారాయణ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎస్.కోట పట్టణంలోని శిరికి రిసార్ట్స్ లో వైఎస్సార్సీపీ మండల నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీలక్ష్మిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, విద్యార్థులు ఇలా అందరికీ మేలు చేసిన ప్రభుత్వం మనదని గుర్తు చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది.. పరిపాలన ఎలా అందుతోందని చూస్తే ఆ రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చక్కటి పరిపాలన అందుతోందన్నారు. రాష్ట్రంలో ఏనాడు చూడని సంక్షేమాన్ని ఇప్పుడు మన ప్రభుత్వంలో చూస్తున్నామని తెలిపారు. - పదవులకు రాజీనామాలు చేసి గెలిచిరండి..
కొంత మంది నాయకులు ఈ పార్టీ నుంచి గెలిచి పదవులు పట్టుకుని వెళ్లిపోయారన్నారు. వీరు వెళ్లి పోతే వీళ్ళని తలదన్నే నేతలు వస్తారన్నారు. పార్టీ కార్యకర్తలు అధైర్యం పడకండని హితవుపలికారు. వెళ్లిపోయిన నేతలు నేనే మోనార్క్ అనుకుంటే పొరబాటు అన్నారు. ఆ వెళ్లిపోయిన నేతలు పదవులు పట్టుకుని వేలాడటం ఎందుకు? ఆ పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ గెలిచి రండి తప్పులేదు. ఎవరిమీద ద్వేషంతోనో ఈ మాటలు అనడం లేదు..జాలితో మాత్రమే చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఎందుకు మూలల్లో దాక్కుని తిరుగుతున్నారు..మీరు ముసుగులు తీసేసి తిరగండి. ఇక్కడ రాజీలు..లాలూచీలు లేవని మంత్రి బొత్స ఎమ్మెల్సీ రఘురాజుని ఉద్దేశించి సెటైర్లు వేశారు. ఇక్కడి ఎమ్మెల్యేగా కడుబండి శ్రీను, ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి, నేను మంత్రిగా ఉంటాం. మీ గ్రామాల్లో ఏ అభివృద్ధి కావాలన్నా.. మీ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కావాలన్నా మేము చేస్తాం. జిందాల్ భూముల్లో కంపెనీలు పెట్టి వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. 24/7 నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడు కొందరు పార్టీ మారిన నేతలు లేనిపోని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. పార్టీ మారిన వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. గ్రామాల్లో మీ ప్రచారం మీరు చేసుకోండి. మీ గౌరవం పెంచే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక పార్టీని వదిలి పచ్చ కండువాలు కప్పుకున్నారో అక్కడ మరింత గట్టిగా పనిచేసి మన సత్తాను చూపాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రతీ కార్యకర్త, నాయకుడు నెల రోజుల పాటు కష్టించి పనిచేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఫ్యాన్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.