వినాయక చవితి ఉత్సవాల్లో అప్రమత్తతే అసలైన భద్రత సాలూరు ప్రజలకు టౌన్ సీఐ అప్పలనాయుడు కీలక సూచనలు సాలూరు: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని సాలూరు టౌన్ సీఐ అప్పలనాయుడు ప్రజలకు సూచించారు. వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోవాలని, మండపాల ఏర్పాటుకు సంబంధించి సంబంధిత రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరిగా పొందాలని తెలిపారు. మండపాల వద్ద అగ్నిప్రమాదాల నివారణకు తగిన ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు EMERGENCY EXIT ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల్లో విద్యుత్ వైరింగ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యత లేని వైర్లు, ప్రమాదకరమైన విద్యుత్ కనెక్షన్లు ఉపయోగించరాదని స్పష్టం చేశారు. ఉత్సవ ప్రాంతాల్లో CCTV కెమెరాలు ఏర్పాటు చేయడం, రాత్రి వేళల్లో తగిన వెలుతురు ఉండేలా చూడటం, ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా మండపాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఐ సూచించారు. మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ ఉత్సవ ప్రాంగణాల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల భద్రతకు నిర్వాహకులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి అదనపు కార్యక్రమాలు నిర్వహించరాదని, ఇతర మతాలు, వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి చర్యలకు పాల్పడరాదని సూచించారు. కటౌట్లు, క్రాకర్లు, ఆయుధాలు లేదా ప్రమాదకర వస్తువులను ఉత్సవ ప్రాంగణాల్లోకి తీసుకురావద్దని, మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొనడం, గొడవలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టం ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఉత్సవాల పేరుతో నిబంధనలు ఉల్లంఘించడం, అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం వంటి చర్యలను పోలీసులు సహించరని సీఐ అప్పలనాయుడు స్పష్టం చేశారు. పోలీసులు, నిర్వాహకులు, ప్రజలు సమన్వయంతో వ్యవహరిస్తేనే ఉత్సవాలు సంతోషకరంగా, ప్రశాంతంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ 112, ఫైర్ 101, అంబులెన్స్ 108, మహిళా సహాయ సేవలు 181ను సంప్రదించాలని సాలూరు ప్రజలకు సూచించారు. “భక్తితో ఉత్సవం… బాధ్యతతో నిర్వహణ… అప్రమత్తతతో భద్రత” వినాయక చవితి ఉత్సవాలు ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచేలా ఉండాలని, ఒకరి ఆనందం మరొకరికి ఇబ్బందిగా మారకుండా నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించాలని టౌన్ సీఐ అప్పలనాయుడు కోరారు. Spread the love టపా నావిగేషన్ పారాది కొత్త బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు అధికారిక అనుమతి