పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాల విద్యార్థులకు అందుబాటులో అదనపు తరగతి గదులు
*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*

విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో రెండు అంతస్తులలో నూతనంగా నిర్మించిన ఆరు తరగతి గదులు, చిల్డ్రన్ పార్కు మరియు సైకిల్ పార్కింగ్ షెడ్డును జిల్లా *ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* గారి సతీమణి మరియు *పాఠశాల చైర్ పర్సన్ శ్రీమతి జి.రూపా నాయుడు* గారు జూన్ 22న ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా ఎస్పీ దంపతులు ముఖ్య అతిధులుగా హాజరుకాగా, పండితులు పూర్ణకుంభం మరియు మంత్రోచ్చరణతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రూపా దామోదర్ గారు మాట్లాడుతూ – విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, వారికి అనుకూలమైన వాతావరణం కల్పించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. పోలీస్ స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి మరింత సౌకర్యవంతమైన తరగతి గదులు అవసరమని గుర్తించి త్వరితగతిన నూతన తరగతి గదులను నిర్మించారని తెలిపారు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ తరగతి గదులు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. పిల్లలకు చదువుతో పాటు శారీరక ద్రుఢత్వం కూడా ముఖ్యమేనని, కావున ప్రతి రోజు ఒక గంట విద్యార్ధులకు పి.టి. క్లాస్ నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని అన్నారు. తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా పేరెంట్ టీచర్ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్ధుల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు మాట్లాడుతూ – పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాల క్రమంగా వృద్ధి చెందుతుందని, ఇప్పటికే అనేక సౌకర్యాలతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా, ఉన్నత విద్యను, క్రమశిక్షణను తక్కువ ఫీజులతో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో విదార్ధులకు తరగతి గదుల అవసరం ఉందని తన దృష్టికి వచ్చిందని, వెంటనే త్వరితగితిన నూతన తరగతి గదులను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. ఈ రోజు రెండు అంతస్తులలో నూతనంగా నిర్మించిన ఆరు తరగతి గదులను ప్రారంభించామని, ఈ విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి తీసుకొని వచ్చామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. పడవ తరగతి విద్యార్ధులకు “ఆల్ ది బెస్ట్” తెలిపి ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 594 మార్కులు సాధించే విద్యార్ధులకు ఆడ పిల్లలకు రూ.60,000/-, మగ పిల్లలకు రూ.50,000/- నగదు బహుమతిగా అందిస్తామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ప్రకటించారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని మెరుగైన వసతులు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. విదార్ధులకు చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యమని, ఉపాధ్యాయులు మరియు విద్యార్ధుల మధ్య బంధం మంచిగా ఉండాలని, అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. తరుచూ పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించి, అవసరమైన సలహాలను, సూచనలను ఇచ్చిపుచ్చుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. చదువుతో పాటు విదార్ధులకు గేమ్స్, యోగా, స్వీయ రక్షణ మెలుకువలు వంటివి కూడా నేర్పించాలని అన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.సౌమ్యలత, పి.కిరణ్ కుమార్, డీఎస్పీలు ఈ.కోటిరెడ్డి, ఎస్.రాఘవులు, పలువురు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి