పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, వృత్తిపరమైన సామర్థ్యాల పెంపునకు ఆధునిక సౌకర్యాలు ఎంతో అవసరమని జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్ శిక్షణా కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక జిమ్‌తో పాటు వీఐపీ లాంజ్‌ను జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మరియు 5వ బెటాలియన్ కమాండంట్ శ్రీ వై.రవి శంకర్ రెడ్డి,ఐపిఎస్ జూలై 15న ఘనంగా ప్రారంభించారు. ముందుగా పండితులు పూర్ణకుంభం మరియు మంత్రోచ్చరణతో జిల్లా ఎస్పీ మరియు బెటాలియన్ కమాండంట్ గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ …. పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, రోజువారీ విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఎంతో అవసరమన్నారు. అందుకోసం పోలీసు శిక్షణ కేంద్రాల్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పించడం పోలీసు శాఖ ప్రాధాన్యతగా తీసుకుంటోందని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్‌లో అత్యాధునిక వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ జిమ్ ద్వారా శిక్షణ పొందుతున్న పోలీసు శిక్షణార్థులు, అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ వ్యాయామం చేసి తమ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవచ్చన్నారు. శారీరకంగా దృఢంగా ఉన్న పోలీసు సిబ్బంది ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించగలరని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీస్ శిక్షణా కళాశాల అనేది సమర్థవంతమైన పోలీసు బలగాల రూపకల్పనకు కీలకమైన కేంద్రంగా నిలుస్తుందని, ఇక్కడ అందిస్తున్న నాణ్యమైన శిక్షణతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలు కూడా శిక్షణార్థుల నైపుణ్యాలను పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ వివరించారు. అలాగే ప్రారంభించిన వీఐపీ లాంజ్‌ను ఉన్నతాధికారుల సందర్శనలు మరియు ప్రత్యేక అతిథుల కోసం అన్ని వసతులతో తీర్చిదిద్దినట్లు తెలిపారు. సౌకర్యవంతమైన వాతావరణంలో ప్రత్యేక అతిథులు మరియు ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించేందుకు ఈ లాంజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు జిమ్‌లోని ఆధునిక వ్యాయామ పరికరాలను పరిశీలించి వాటి వినియోగంపై అధికారులతో మాట్లాడారు. వీఐపీ లాంజ్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను కూడా పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసి, పోలీస్ శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్ డి.రామచంద్ర రాజు గారికి అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్, డి.రామ చంద్ర రాజు, అదనపు ఎస్పీలు, పి.సౌమ్యలత, పి.కిరణ్ కుమార్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ అధికారుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యం-జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర రెడ్డి