ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మాట తప్పని నైజం
తాటి కార్మికుడు రొంగలి ఎల్లయ్యకు 3 సెంట్ల స్థలంలో రూ. 5 లక్షలతో పక్కా గృహ నిర్మాణం
నూతన గృహాన్ని ప్రారంభించి, లబ్ధిదారునికి 50 ఇంచుల స్మార్ట్ టీవీ బహుకరించిన ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు
గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో పేదలకు అన్యాయం, దోపిడీలే మిగిలాయి: మాజీ మంత్రి ధ్వజం

*చీపురుపల్లి,జూలై15:*
పేదల సంక్షేమమే ధ్యేయంగా, ఇచ్చిన హామీలను రికార్డు స్థాయిలో నెరవేరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా నిలుస్తోందని మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు అన్నారు. చీపురుపల్లి మండలం, రావివలస పంచాయతీ, పైలపేట గ్రామానికి చెందిన పేద తాటి కార్మికుడు రొంగలి ఎల్లయ్యకు ప్రభుత్వం నిర్మించిన పక్కా గృహాన్ని బుధవారం నాడు ఆయన రిబ్బన్ కట్ చేసి, సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడి కుటుంబానికి ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా 50 ఇంచుల స్మార్ట్ టీవీని బహుమతిగా అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ కిమిడి కళావెంకటరావు గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వమని కొనియాడారు. ఫిబ్రవరి 26వ తేదీన ముఖ్యమంత్రి గారు చీపురుపల్లి పర్యటనకు వచ్చినప్పుడు రొంగలి ఎల్లయ్య అనే నిరుపేద తన పరిస్థితిని వివరించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెంటనే స్పందించి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారని తెలిపారు. దీనికి ప్రభుత్వం వెంటనే రూ. 5 లక్షల నిధులు కేటాయించగా, హౌసింగ్ అధికారులు శరవేగంగా పనులు పూర్తి చేసి కేవలం 88 రోజుల్లోనే ఒక బెడ్రూం, హాల్, కిచెన్, విద్యుత్ సౌకర్యాలతో కూడిన పక్కా గృహాన్ని నిర్మించి ఇచ్చారని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

గత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఇళ్ల పేరుతో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని, అక్రమాలు, అవినీతి, దోపిడీలతో పేదలను వంచించారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని చెప్పారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పెన్షన్లను, గత మూడు నెలల బకాయిలతో కలిపి ఒకేసారి రూ. 7000 అందించి పేద కుటుంబాల్లో వెలుగులు నింపిందని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్ళుగా భావిస్తూ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను రప్పిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తోందని వివరించారు. అలాగే నియోజకవర్గంలో వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో చీపురుపల్లి పరిధిలో 2500 ఉచిత బోర్ల కనెక్షన్లను పూర్తి చేసి రైతులకు అందిస్తామని ప్రకటించారు.

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి గారి ఆదేశాలను క్షేత్రస్థాయిలో అత్యంత వేగంగా అమలు చేసిన హౌసింగ్ పిడి మరియు సిబ్బందిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,హౌసింగ్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి