యువతే మార్పుకు బలమైన వేదిక సామాజిక మాధ్యమాలను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి: మంత్రి సంధ్యారాణి సాలూరు: ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ యువత సమాజ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె యువతతో వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం యువత చేతుల్లో ఉన్న సామాజిక మాధ్యమాలు ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని మంత్రి అన్నారు. సోషల్ మీడియాను కేవలం వినోదానికి పరిమితం చేయకుండా, ప్రజలకు ఉపయోగపడే సమాచారం, సామాజిక అవగాహన, స్ఫూర్తిదాయకమైన అంశాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు వినియోగించాలని సూచించారు. యువతలోని సృజనాత్మకతకు సరైన దిశ లభిస్తే సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలపై అవగాహన పెంచుకోవాలి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై యువత పూర్తి అవగాహన కలిగి ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్న వారికి వాటి సమాచారం చేరేలా యువత తమ పరిధిలో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లడంలో యువత చురుకైన పాత్ర పోషించాలన్నారు. ఉద్యోగ సాధనలో నిరంతర కృషి ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిరంతర సాధన చేయాలని మంత్రి సూచించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. విద్యార్హతలతో పాటు కమ్యూనికేషన్, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకుంటే భవిష్యత్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. తల్లిదండ్రులను గౌరవించాలి యువతలో విద్యతో పాటు సంస్కారం, కుటుంబ విలువలు కూడా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులతో చర్చించాలని, ముఖ్యంగా తల్లిని గౌరవిస్తూ ఆమె సలహా, ఆశీర్వాదాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కుటుంబ విలువలను మరచిపోకూడదని హితవు పలికారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, యువత, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ సేవే సందేశం.. రక్తదానమే సంకల్పం హెటిరో ఉద్యోగ మేళాలో ప్రతిభకు పట్టం శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల వేదికగా 11 మంది అభ్యర్థుల ఎంపిక