మోదీ జన్మదినం సందర్భంగా సాలూరులో బీజేపీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్

సాలూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సాలూరులో బీజేపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సాలూరు వెలంపేటలోని సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.

మోదీ జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ప్రజోపయోగ కార్యక్రమాల ద్వారా సేవా స్ఫూర్తిని చాటాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతల సహాయం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారుల అభివృద్ధి, రవాణా కనెక్టివిటీ వంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో ఆర్థిక, వాణిజ్య, ఉపాధి అవకాశాలకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్న వారు రక్తదానానికి ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె భానోజీరావు, మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హేమా నాయక్, సాలూరు పట్టణ అధ్యక్షుడు వానపల్లి మురళీకృష్ణ, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రెడ్డి సింహాచలం, జిల్లా కోశాధికారి పేర్ల విశ్వేశ్వరరావు, బీజేపీ నాయకులు కోలగట్ల గోపి, జనసేన నాయకులు పెనుగంటి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన దాతలను నాయకులు అభినందించారు.


— 9 NEWS | రిపోర్టర్ శ్రావణ్ కుమార్

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి