కోటికి పైగా విలువైన ఆభరణాలు.. క్షణాల్లో మిస్సింగ్.. గంటల్లో పోలీసుల ట్రేసింగ్!

బంగారం కోసం సాంకేతిక నిఘా.. క్షేత్రస్థాయిలో జల్లెడ.. సాలూరు టౌన్ పోలీసుల వేగవంతమైన ఛేదింపు

సాలూరు, అక్టోబర్ 3 :

సుమారు రూ.కోటి విలువైన 900 గ్రాముల బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగు కనిపించకుండా పోవడంతో సాలూరు టౌన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫిర్యాదు అందిన వెంటనే సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల పరిశీలనతో పాటు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి కేవలం మూడు గంటల్లోనే ఆభరణాలను గుర్తించి యజమానికి అప్పగించారు.

సాలూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అక్టోబర్ 3న మధ్యాహ్నం బ్యాంకు లాకర్‌ నుంచి సుమారు 900 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. ఆభరణాలతో కూడిన బ్యాగును వాహనం హుక్‌కు తగిలించుకుని కోట జంక్షన్‌ నుంచి తెలగ వీధి వైపు వెళ్తుండగా మార్గమధ్యలో బ్యాగు జారిపడింది. కొంతదూరం వెళ్లిన అనంతరం బ్యాగు కనిపించకపోవడంతో విషయం గుర్తించిన ఆయన వెంటనే సాలూరు టౌన్ పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనను సీరియస్‌గా తీసుకుని వెంటనే రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ బ్యాగు వెళ్లిన మార్గాన్ని గుర్తించే ప్రయత్నం చేయగా.. మరో బృందం సంఘటన జరిగిన ప్రాంతం నుంచి క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించింది.

సాంకేతిక బృందం అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పెదకోమటిపేట రామమందిరం పరిసరాల వరకు ద్విచక్ర వాహనం కదలికలను గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి తెలగ వీధి వరకు ఫిజికల్ ఎవిడెన్స్ బృందం తనిఖీలను ముమ్మరం చేసింది. మార్గంలోని ప్రజలను విచారిస్తూ, లభించిన సమాచారాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగారు.

ఈ క్రమంలో డబ్బివీధి ప్రాంతంలో విచారణ చేపడుతున్న సమయంలో ఓ మహిళకు బ్యాగు దొరికినట్లు పోలీసులకు సమాచారం లభించింది. ఆమెను సంప్రదించి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఫిర్యాదుదారుడు తెలిపిన బంగారు ఆభరణాలు ఉన్నట్లు పరిశీలనలో నిర్ధారించారు.

ఈ విధంగా ఫిర్యాదు అందిన సుమారు మూడు గంటల్లోనే 900 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసి సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి చేతుల మీదుగా బంగారు ఆభరణాలను యజమానికి అప్పగించారు. విలువైన ఆభరణాలు తిరిగి లభించడంతో బాధితుడు ఆనందం వ్యక్తం చేసి సాలూరు టౌన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

సాంకేతిక ఆధారాలను సమర్థంగా వినియోగించడం, క్షేత్రస్థాయిలో వేగంగా స్పందించడం, రెండు బృందాలను సమన్వయంతో ముందుకు నడిపించడం ద్వారా తక్కువ సమయంలోనే కేసును ఛేదించడంపై పోలీసు అధికారులు దృష్టి సారించారు.

వేగవంతమైన దర్యాప్తుతో సుమారు రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను మూడు గంటల్లోనే గుర్తించి యజమానికి అప్పగించిన సాలూరు టౌన్ సీఐ అప్పలనాయుడు, ఎస్సై అనిల్ కుమార్, సిబ్బంది రాంబాబు, అప్పన్నలను జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి