మన్యం జిల్లా చరిత్రలో అపూర్వ ఘట్టం.. రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన జిల్లా అధిపతిహోదాను మరిచి.. ప్రోటోకాల్‌ను వీడి.. తన కారులోనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి చేర్చిన వైనం*జిల్లా వాసుల హృదయాలను గెలుచుకున్న కలెక్టర్ గారి ఉదారత మరపురాని మానవత్వం.. మనసున్న మహారాజుపార్వతీపురం / సీతానగరం, ఏప్రిల్ 12: ఒక జిల్లాకు అత్యున్నత అధికారి అంటే సాధారణంగా భారీ కాన్వాయ్, కట్టుదిట్టమైన భద్రత, ఎవరికీ అందనంత ఎత్తులో ఉండే హోదా.. ఇవే మనకు కనిపిస్తాయి. కానీ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు వీటన్నింటికీ భిన్నమని, ఆయనది పదవి కంటే పైమెట్టులో ఉండే మానవత్వమని నేటి ఘటనతో మరోసారి రుజువైంది. ఆదివారం తన అధికారిక పర్యటనలు ముగించుకుని తిరిగి వస్తుండగా, సీతానగరం మండలం చినభోగిలి సమీపంలో జరిగిన ప్రమాదం ఆయనలోని కరుణా హృదయాన్ని ఆవిష్కరించింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని చూసి కలెక్టర్ గారు స్పందించిన తీరు, మన్యం జిల్లా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది.*కాన్వాయ్ ఆగింది.. కరుణ మొదలైంది*చినభోగిలి వద్ద ఒక వ్యక్తి బైక్ పై నుండి కిందపడి తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన ప్రాణాపాయ స్థితిలో ఉండటాన్ని గమనించిన కలెక్టర్ గారు, క్షణం కూడా ఆలోచించకుండా తన కాన్వాయ్‌ను నిలపాలని ఆదేశించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి బొబ్బిలి మండలం, కృష్ణరాయపురం గ్రామానికి చెందిన అజర్ శ్రీనివాసరావుగా గుర్తించారు. తీవ్రమైన గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న శ్రీనివాసరావును చూడగానే కలెక్టర్ గారు చలించిపోయారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో అధికారులు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోతుంటారు. కానీ, కలెక్టర్ గారు మాత్రం స్వయంగా కారు దిగి, బాధితుడి వద్దకు వెళ్లి పరిస్థితిని గమనించారు. సమయం మించిపోతే ప్రాణం పోతుందన్న ఆవేదన ఆయన కళ్ళలో కనిపించింది. తన కారు పాడవుతుందనో, లేదా ప్రోటోకాల్ ఇబ్బందులు వస్తాయనో ఏమాత్రం ఆలోచించకుండా, ఆ సామాన్యుడిని తన కారులోనే ఎక్కించుకున్నారు.మన్యం జిల్లాలో ఇదే ప్రథమం.. అరుదైన చొరవ…పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత ఒక జిల్లా కలెక్టర్ స్వయంగా ఒక రోడ్డు ప్రమాద బాధితుడిని తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించడం ఇదే మొదటిసారి. జిల్లా గతిని మార్చే పాలనా నిర్ణయాలతోనే కాకుండా, ఇలాంటి అసాధారణ మానవతా దృక్పథంతో కూడా ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అధికార బలంతో కాకుండా, ప్రేమతో ప్రజలను ఎలా గెలుచుకోవచ్చో ఆయన నిరూపించారు. చుట్టుపక్కల ఉన్న జనం కలెక్టర్ గారి చొరవ చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా, ఆయనలోని సేవా గుణానికి ఫిదా అయిపోయారు.*అంత్య క్షేమం వరకు అండగా.. స్వయంగా ఆసుపత్రిలో జాయిన్*ముందుగా బాధితుడు అజర్ శ్రీనివాసరావును సమీపంలోని సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య సిబ్బందితో మాట్లాడి, స్వయంగా దగ్గరుండి ప్రాథమిక చికిత్స చేయించారు. అయితే బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని, అపస్మారక స్థితి నుండి కోలుకోలేదని గుర్తించిన కలెక్టర్, అక్కడితో తన బాధ్యత తీరిపోయిందని అనుకోలేదు. మళ్ళీ అదే కారులో బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి, అక్కడ జాయిన్ చేసే వరకు ఆయన వెన్నంటే ఉన్నారు.*ప్రశంసల జల్లు.. ఆదర్శప్రాయం*కలెక్టర్ అంటే పాలనలోనే కాదు.. ప్రాణాలను కాపాడటంలో కూడా ముందే ఉంటారు అంటూ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ప్రభాకర రెడ్డి గారి పేరే మారుమోగిపోతోంది. అపస్మారక స్థితిలో ఉన్న కృష్ణరాయపురం వాసికి అపన్నహస్తం అందించి ప్రాణదాతగా నిలిచిన తీరు అద్భుతమని అందరూ కొనియాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా, బహిరంగంగా ప్రజలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక ఉన్నత అధికారి ఇలాంటి ఉదాత్తమైన పని చేస్తే, అది సమాజంలోని అందరికీ గొప్ప స్ఫూర్తినిస్తుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆయన చూపిన ఈ చొరవ ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని, ఇలాంటి కలెక్టర్ మా జిల్లాకు ఉండటం మా అదృష్టమని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.! Spread the love టపా నావిగేషన్ అన్నార్థులకు అండగా మాతృభూమి సేవా సంఘం