“మరణించిన తర్వాత కూడా మరో ఇద్దరికి చూపునిచ్చి వారి రూపంలో జీవించవచ్చు” అని విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ పేర్కొన్నారు. సోమవారం ఆసుపత్రిలో మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంబ సభ్యులను ఒప్పించి, వారి నేత్రాలను రెడ్ క్రాస్ ఐ బ్యాంక్ ప్రతినిధులు సేకరించారు.

విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంకు చెందిన తెలగసెట్టి రామారావు (44) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. అలాగే, విజయనగరం అయ్యప్ప నగర్‌కు చెందిన పి. చంద్రకళ (56) ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే మరణించారు.
ఈ విషాద సమయంలో రెడ్ క్రాస్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ఏ. రమణ మృతుల కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించారు. తమ వారు లేకపోయినా, వారి కళ్ళు మరొకరికి వెలుగునిస్తాయన్న గొప్ప ఉద్దేశంతో కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించారు.
ప్రభుత్వ ఆసుపత్రి ఫొరెన్సిక్ నిపుణులు డాక్టర్ ఎల్. ఆనంద్ కుమార్ సహకారంతో, డిబిసిఎస్ డాక్టర్ త్రినాథ్ రావు, డాక్టర్ రత్నకుమారిల సూచనల మేరకు నేత్రాలను (కార్నియాలను) విజయవంతంగా సేకరించారు.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ మాట్లాడుతూ.. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని, ప్రతి ఒక్కరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మానవత్వంతో స్పందించి నేత్రదానానికి ముందుకు వచ్చిన మృతుల కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి