15 జిల్లాల క్రీడాకారులతో మూడు రోజులపాటు ప్రతిష్ఠాత్మక పోటీలు పారాది: బొబ్బిలి మండలం పారాది గ్రామం సాఫ్ట్ బాల్ క్రీడా సందడితో కళకళలాడింది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 13వ సబ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని 15 జిల్లాల నుంచి క్రీడాకారులు తరలిరావడంతో పారాదిలో పండుగ వాతావరణం నెలకొంది. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన), ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో మాట్లాడి పోటీలకు శుభాకాంక్షలు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలను పారాది గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంతో పాటు రాజా కాలేజ్ గ్రౌండులో నిర్వహించనున్నారు. అనంతపురం, బాపట్ల, చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, వైఎస్సార్ కడప, విజయనగరం జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బేబీ నాయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడలను కేవలం పోటీగా కాకుండా యువతకు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వేదికగా చూడాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్ మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువతకు ఉన్నత స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్పోర్ట్స్ కోటా ద్వారా క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. క్రీడాకారుల సర్టిఫికెట్లను సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం ఉద్యోగ అవకాశాల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. పారాది గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకుడు అల్లాడ భాస్కర్రావు, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సుంకరి సాయి రమేష్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ ఏర్పాట్లు చేపట్టారు. పోటీలకు వచ్చిన క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన గ్రామ పెద్దలు, విద్యాశాఖ అధికారులు, PETలు, క్రీడా సంఘాల ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ సూర శ్రీనివాసరావు, డీఎస్పీ రాకోటి గోవిందరావు, బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి, బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కళ్యంపూడి లక్ష్మి, డిప్యూటీ DEO మాణిక్యాలరావు, మాజీ చైర్మన్ రాంబర్కి శరత్, MEOతో పాటు పలువురు పాల్గొన్నారు. 9 న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్ Spread the love టపా నావిగేషన్ వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. సాలూరు రూరల్ సీఏ రామకృష్ణ పారమ్మ తల్లి రూపంలో విఘ్నేశ్వరుడు.. భక్తులకు కనువిందు చేస్తున్న అద్భుత మట్టి విగ్రహం