సోషల్ మీడియా పోస్టులతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు* మతాలు, కులాల, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినా, వ్యక్తిత్వ హననంకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్న జిల్లా ఎస్పీ* పోస్టులు పెట్టే సమయంలో విజ్ఞతతో వ్యవహరించాలని నెటిజనులను కోరిన జిల్లా ఎస్పీ* కేవిఆర్ యుట్యూబ్ ఛానల్లో భారత రాజ్యాంగం పట్ల అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదుకు చెందిన కోషిక వెంకటరామరెడ్డి (42 సం.లు)అనే వ్యక్తికి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, బొబ్బిలి తేది.02.07.2026న 14రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిందని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ తెలిపారు. వివరాల్లోకి వెళితే… విజయనగరం జిల్లా బాడంగి మండలం మరియు గ్రామానికి చెందిన కంది రమేష్ తేది 10.04.2026న యుట్యూబ్ లో వీడియోలు చూస్తుండగా, కేవిఆర్ యుట్యూబ్ ఛానలులో పెట్టిన ఒక వీడియోను చూడగా అందులో కోషిక వెంకటరామరెడ్డి అనే వ్యక్తి రాజ్యాంగం పట్ల అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడం చూసి, బాడంగి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసాడన్నారు. ఇటువంటి చర్యలు సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున ఫిర్యాదును పరిశీలించిన అప్పటి బాడంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ జె.తారకేశ్వరరావు కేసు నమోదుచేయగా, బొబ్బిలి రూరల్ సిఐ ఎస్.శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ముద్దాయి కే.వి.రెడ్డికి మూడుసార్లు తేది.17.04.2026, 30.04.2026 మరియు 04.05.2026న దర్యాప్తు అధికారి వద్ద హాజరుకమ్మని నోటీసులు పంపించామని, కాని సదరు ముద్దాయి హాజరుకాలేదని తెలిపారు. సదరు ముద్దాయిపై కర్నూలు మరియు గుంటూరు జిల్లాల్లో ఇలాంటి కేసులు ఉన్నాయని తెలిపారు. తేది.05.05.2026న కోర్టు ముద్దాయికి నాన్ బెయిలబుల్ వారంట్ ఇచ్చిందని తెలిపారు. పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు తేది.30.06.2026న హైదరాబాదులో పోలీస్ బృందం వారంట్ ముద్దాయి కే.వి.రెడ్డిని అరెస్ట్ చేసి తేది.01.07.2026న విజయనగరం జిల్లాకు తరలించారని తెలిపారు. అనంతరం తేది.02.07.2026న జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, బొబ్బిలిలో ప్రవేసపెట్టగా, కోర్టు ముద్దాయికి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించిందని, ముద్దాయిని బొబ్బిలి సబ్ జైలుకు తరలించామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ తెలిపారు. సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా అనుచితమైన పోస్టులు పెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని, ఎవరిని ఉపేక్షించమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలే తప్ప, వాస్తవాలను వక్రీకరిస్తూ ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెట్టి మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, వ్యక్తిత్వ హననంకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా నిఘా పెట్టిందన్నారు. ఇందుకుగాను ఒక పోలీసు బృందాన్ని ప్రత్యేకంగా నియమించి, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ బృందం అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకొని, విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో పోస్టులు పెట్టిన వ్యక్తుల వివరాలను రాబట్టి, వారికి నోటీసులు జారీ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ఉపక్రమిస్తుందన్నారు. కావున, ప్రజలు సోషల్ మీడియాను వినియోగించే సమయంలో విజ్ఞతతో వ్యవహరించాలన్నారు. Spread the love టపా నావిగేషన్ పోయిన మొబైల్స్ అందజేత