విజయనగరం, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం విజయనగరం కోట కూడలి నుంచి 150 అడుగుల పొడవైన జాతీయ జెండాతో నిర్వహించిన భారీ ర్యాలీని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ జెండా ఊపి ప్రారంభించారు. భారీ సంఖ్యలో ప్రజలు, యువత, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ **“మన దేశం–మన బాధ్యత”**గా భావించి ప్రతి ఒక్కరూ ర్యాలీలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రాంతీయ వాసి, మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కృషి చేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎన్నో తరాల నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా, వారి దిశానిర్దేశంలో “మన దేశం–మన బాధ్యత” నినాదంతో వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ భారీ ర్యాలీ ప్రజల్లో స్ఫూర్తి, దేశభక్తి, దేశం పట్ల గౌరవాన్ని మరింత పెంపొందించేలా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జాతీయ జెండాను చూడగానే ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగుతుందని, పండగ వాతావరణం మనసంతా నిండుతుందని భావోద్వేగంతో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను స్మరించుకుంటూ భావితరాలకు వారి సేవలను తెలియజేయాలని కోరారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ దేశానికి యువతే వెన్నెముక అని అన్నారు. ప్రతి యువకుడిలో దేశభక్తి, దేశంపై ప్రేమ, అభిమానం వెల్లివిరియాలని, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పిలుపు మేరకు యువత దేశభక్తిని బాధ్యతగా స్వీకరించి భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొనడం అభినందనీయమన్నారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – “హర్ ఘర్ తిరంగా” ర్యాలి కేవలం ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడానికే పరిమితం కాకుండా, ప్రతి పౌరుడిలో దేశభక్తి భావనను మరింత బలపరిచే గొప్ప కార్యక్రమమని తెలిపారు. జాతీయ జెండా మన దేశ గౌరవానికి, ఐక్యతకు, స్వాతంత్ర్యానికి ప్రతీక అని అన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని ఘనంగా చాటాలని ప్రజలను కోరారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, యువత జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ సిహెచ్ సత్తిబాబు, ఆర్డీవో సుధా సాగర్ మున్సిపల్ కమిషనర్ బాలస్వామి డిఆర్డిఏ పిడి శ్రీనివాస్ పాణి, డి ఎస్ డి ఓ వెంకటేశ్వరరావు, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ గంజాయి వినియోగం లేదా అమ్మకంపై సమాచారం అందిస్తే రూ.5,000 నగదు బహుమతి *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్