పార్వతీపురం మన్యం జిల్లా, సెప్టెంబర్ 6 | 9 NEWS ప్రతినిధి శ్రావణ్ కుమార్ జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో గ్రిడ్ ఫ్రీక్వెన్సీ పడిపోతోందని, గ్రిడ్ వ్యవస్థను కాపాడేందుకు కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక విద్యుత్ కోతలు విధించాల్సి వస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా ఎలక్ట్రికల్ ఎస్ఈ తెలిపారు. విద్యుత్ డిమాండ్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా ఇప్పటికే జిల్లాలోని పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించినప్పటికీ, రాత్రి సమయాల్లో పరిస్థితి అదుపులోకి రావడం లేదని అధికారులు వెల్లడించారు. గ్రిడ్ ఫ్రీక్వెన్సీ మరింత పడిపోతే మొత్తం విద్యుత్ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, గ్రిడ్‌ను కాపాడేందుకు అత్యవసర పరిస్థితుల్లో గృహ విద్యుత్ సరఫరాను కూడా తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గడం.. డిమాండ్ పెరగడం వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పుల కారణంగా పవన, జల విద్యుత్ ఉత్పత్తి తగ్గడం కూడా ప్రస్తుత పరిస్థితికి ఒక కారణమని అధికారులు తెలిపారు. అదనపు విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, అవసరమైన స్థాయిలో విద్యుత్ అందుబాటులో లేకపోవడం సమస్యను మరింత క్లిష్టతరం చేస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడానికి విద్యుత్ శాఖ చర్యలు కొనసాగిస్తోందని ఎస్ఈ తెలిపారు. పరిస్థితి త్వరలోనే మెరుగుపడేలా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు కీలక విజ్ఞప్తి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు కోరారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అత్యవసరం కాని విద్యుత్ ఉపకరణాల వినియోగాన్ని తగ్గించాలని, అధిక విద్యుత్ వినియోగించే పరికరాలను ఒకేసారి వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కోతల కారణంగా ప్రజలకు కలుగుతున్న అసౌకర్యానికి ఎస్ఈ విచారం వ్యక్తం చేస్తూ, గ్రిడ్ భద్రతతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని విజ్ఞప్తి చేశారు. Spread the love టపా నావిగేషన్ పారాది కొత్త బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు అధికారిక అనుమతి