బొబ్బిలి, సెప్టెంబర్ 15: బొబ్బిలి కోటలో మంగళవారం టీడీపీ శ్రేణుల సందడి నెలకొంది. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) బొబ్బిలి కోటకు విచ్చేసిన సందర్భంగా దర్బార్ మహల్లో బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలను చిన్న శ్రీనుకు పరిచయం చేశారు. అనంతరం మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో ఫోటోలు దిగారు. అలాగే నియోజకవర్గ జనసేన నాయకులను కూడా చిన్న శ్రీనుకు పరిచయం చేశారు. మీడియాతో ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ.. మజ్జి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోకి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ శ్రేణుల తరఫున చిన్న శ్రీనుకు స్వాగతం పలికారు. ఆయన చేరికను తాను వ్యతిరేకించినట్లు కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు. చిన్న శ్రీను చేరికతో పార్టీ మరింత బలపడుతుందని పూర్తి నమ్మకం ఉందని బేబీనాయన తెలిపారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో పనిచేసినప్పటికీ వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బేబీనాయనకు ఎల్లప్పుడూ సహకరిస్తానని తెలిపారు. బేబీనాయన రాజకీయంగా చిరస్థాయిగా ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ స్థాయిల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయంతో ముందుకు సాగుతామని, పార్టీ అధినాయకత్వం దిశానిర్దేశం మేరకు పనిచేస్తానని చెప్పారు. మాజీ మంత్రి సుజయ్ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడుతో కూడా మాట్లాడానని, వారిని కలుస్తానని చిన్న శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి, విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మడక తిరుపతిరావు, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సుంకరి సాయిరమేష్, ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్రావు, చింతల రామకృష్ణ, బొబ్బిలి పట్టణం, నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 9 NEWS | రిపోర్టర్ శ్రావణ్ కుమార్ Spread the love టపా నావిగేషన్ మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఇంజినీర్లకు విశ్వేశ్వరయ్యే స్ఫూర్తి