బొబ్బిలిలో ఘనంగా జాతీయ ఇంజినీర్ల దినోత్సవం.. విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన బేబీనాయన

బొబ్బిలి, సెప్టెంబర్ 15:
భారత ఇంజినీరింగ్ రంగానికి విశేష సేవలందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరించుకుంటూ బొబ్బిలిలో జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. దేశంలో ఆధునిక సాంకేతిక సదుపాయాలు పరిమితంగా ఉన్న సమయంలోనే తన ఇంజినీరింగ్ ప్రతిభతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసిన మహనీయుడిగా ఆయనను అభివర్ణించారు. జలవనరుల అభివృద్ధి, జలాశయాల నిర్మాణం తదితర రంగాల్లో ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.

ఇంజినీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు చేపట్టడం మాత్రమే కాదని.. సమాజ అభివృద్ధికి ఉపయోగపడే ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడమే నిజమైన ఇంజినీరింగ్ అని బేబీనాయన పేర్కొన్నారు. యువ ఇంజినీర్లు విశ్వేశ్వరయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నూతన ఆవిష్కరణలు, ప్రజోపయోగ నిర్మాణాలపై దృష్టి సారించాలని సూచించారు.

కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ బి. సత్యనారాయణరెడ్డి, కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్. రాధారాణి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి, టీడీపీ నాయకులు అల్లాడ భాస్కర్రావు, చింతల రామకృష్ణ, వాసిరెడ్డి సత్యనారాయణ, కరణం భాస్కరరావు, బొంతు త్రినాథ్, పంచాయతీరాజ్ డీఈ అప్పారావు, ఎంపీడీవో రవికుమార్, ఇంజినీరింగ్ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


9 NEWS | స్టాఫ్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి