సొంత ఖర్చులతో 200 మట్టి గణపతుల పంపిణీ.. గోపి సేవా స్ఫూర్తికి అభినందనలు

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు టౌన్, సెప్టెంబర్ 13, 9 న్యూస్:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సాలూరులో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ కార్యకర్త కోలగట్ల గోపి ముందడుగు వేశారు.

తన సొంత ఖర్చులతో సుమారు 200 మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి, వాటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. స్వయంగా తోపుడు బండిపై మట్టి గణపతి విగ్రహాలను తీసుకెళ్లి సాలూరు పట్టణంలోని వివిధ పురవీధుల్లో పర్యటిస్తూ భక్తులకు అందజేశారు.

వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గోపి పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సహజసిద్ధమైన మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు.

సమాజహిత కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గోపి తెలిపారు. ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను అందించడం తనకు ఎంతో సంతృప్తి, ఆనందాన్ని కలిగించిందన్నారు.

ఈ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను అందుకున్న ప్రజలు గోపి చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. భక్తితో వినాయకుడిని పూజిస్తూ, ప్రకృతిని పరిరక్షించాలనే సందేశాన్ని అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You missed