సాలూరు, ఏప్రిల్ 07 : విద్యార్థులకు అందించే ఆహారం రుచిగా, పోషకవిలువలు కలిగి నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ను అక్షరాలా అమలు చేయాలని,ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా లేదా నాణ్యత లోపించినా సంబంధిత అధికారులపై, ఏజెన్సీల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం సాలూరు పట్టణంలోని మునిసిపల్ హై స్కూల్ ను జాయింట్ కలెక్టర్ మరియు మునిసిపల్ ప్రత్యేక అధికారి సి. యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని విద్యా సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు మరియు ‘ముస్తాబు’ కార్యక్రమ పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలును స్వయంగా పర్యవేక్షించిన ఆయన వంటశాలలను సందర్శించి, భోజనం తయారీలో వాడుతున్న వస్తువుల నాణ్యతను, పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందో లేదో ఆరా తీశారు. విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించి, విద్యార్థులకు అందించే ఆహారం రుచిగా ఉన్నదీ, లేనిదీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజన సమయంలో విద్యార్థుల వద్దకు వెళ్లి, వారితో కలిసి మాట్లాడారు. విద్యార్థుల చేతులను శుభ్రంగా కడుక్కోవడం, క్రమశిక్షణ వంటి అంశాలపై ఆరా తీస్తూ, పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించే గోడ చిత్రాలను పరిశీలించారు. ఎల్లపుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాలు దరిచేరవని, అందుకే ముస్తాబు కార్యక్రమం తీసుకు వచ్చామన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి అని, ముస్తాబు అమలును పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ తరగతి గదులను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి, వారికి అందుతున్న బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ బోర్డుల ద్వారా సైన్స్ వంటి పాఠ్యాంశాలను బోధించే విధానాన్ని పరిశీలించి, విద్యార్థుల విజ్ఞాన స్థాయిని పరీక్షించారు. పలువురు విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి ప్రతిస్పందనను గమనించారు. ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలని దిశా నిర్దేశం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పాఠశాల రికార్డులను, హాజరు పట్టికలను తనిఖీ చేశారు. విద్యార్థుల చేతులను పరిశీలించి, మెనూ అమలు పట్ల ఆరా తీశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, విద్యాశాఖ సిబ్బంది మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్య రాణి