బొబ్బిలి నియోజకవర్గం | సెప్టెంబర్ 16, 2026

ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) హఠాన్మరణం పట్ల బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ ఆర్‌.వీ.ఎస్‌.కె.కె. రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. బొబ్బిలి కోటలో ఇద్దరూ కలిసి ఆళ్ల నాని చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ.. ఆళ్ల నానితో బొబ్బిలి రాజకుటుంబానికి సుదీర్ఘకాలంగా సత్సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. 2004 సంవత్సరం నుంచి తమ కుటుంబంతో ఆయనకు సన్నిహిత అనుబంధం కొనసాగిందన్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఆళ్ల నాని వైద్యారోగ్య శాఖ మంత్రిగా ప్రజలకు అందించిన సేవలను ఎమ్మెల్యే గుర్తుచేశారు. క్లిష్ట పరిస్థితుల్లో వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.

బొబ్బిలి ప్రాంతంతోనూ ఆళ్ల నానికి ప్రత్యేక అనుబంధం ఉందని బేబీనాయన తెలిపారు. బొబ్బిలి పరిసర ప్రాంతంలో ఆయనకు వ్యవసాయ క్షేత్రం కూడా ఉందని, ఈ ప్రాంతంతో ఆయనకు ఉన్న అనుబంధం కేవలం రాజకీయ సంబంధాలకు మాత్రమే పరిమితం కాలేదని గుర్తుచేశారు.

ఆళ్ల నాని హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ప్రజా జీవితంలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, అభిమానులకు తీరని లోటని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు కూడా ఆళ్ల నాని మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ప్రజా జీవితంలో నిర్వహించిన బాధ్యతలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు

✍️ 9 NEWS | రిపోర్టర్ శ్రావణ్ కుమార్

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి