పార్వతీపురం, ఆగస్టు 31: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఓ బాలికల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి సంబంధించిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి బి. రవికుమార్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థినికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో నిర్వహించిన వైద్య పరీక్షల్లో గర్భం దాల్చిన విషయం వెల్లడైనట్లు సమాచారం ఉందన్నారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్రంగా,నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు.విద్యార్థినుల భద్రత విషయంలో కళాశాల యాజమాన్యం,వార్డెన్ మరియు సంబంధిత అధికారుల పర్యవేక్షణలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. విచారణలో ఎవరి నిర్లక్ష్యం ఉన్నా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.ఇరువర్గాల పెద్దలు రాజీ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఘటనపై ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బి. రవికుమార్ కోరారు. విద్యార్థిని గోప్యతకు పూర్తి రక్షణ కల్పిస్తూ,ఆమె సంక్షేమం మరియు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.గతంలో కురుపాం ప్రాంతంలో కూడా విద్యార్థినులకు సంబంధించిన ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, గిరిజన ప్రాంతాల్లోని బాలికల కళాశాలలు, వసతి గృహాలపై ప్రభుత్వం మరియు విద్యాశాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థినుల భద్రతను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి. రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Spread the love టపా నావిగేషన్ గిరిజన నాయకులకు పదవులు తప్ప గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు భరోసా కల్పించలేని పరిస్థితి*