సీతం కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం స్థానిక గాజులరేగ పరిధిలోని సీతం కళాశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యావహారిక భాషా ఉద్యమకారుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన డాక్టర్ అయల సోమయాజుల గోపాలరావు మాట్లాడుతూ తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మాతృభాషను పరిరక్షించుకోవడం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు తెలుగు భాష యొక్క గొప్పతనం, ప్రాచీనత, సాహిత్య సంపదను తెలుసుకొని నిత్య జీవితంలో తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. తెలుగు భాషాభివృద్ధికి గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన సేవలు చిరస్మరణీయమని, అందరికీ అర్థమయ్యే వ్యావహారిక భాష కోసం ఆయన చేసిన ఉద్యమం తెలుగు భాషా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్యఅతిధిగా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ మరియు వెయిట్ లిఫ్టింగ్ కొచ్ శ్రీ చల్లా రాము హాజరయ్యారు. ఈ సందర్బంగా విబిసిన్ టీవీ విజయనగరం రిపోర్టర్ శ్రీమతి బోడె.విజయలక్ష్మి, అలాగే సుమన్ టీవీ విజయనగరం ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీమతి అడప.సీమ మరియు ఎస్సార్ మీడియా స్టాఫ్ రిపోర్టర్. శ్రీమతి పోలూరు సునీత రెడ్డి ఘనంగా సన్మానిoచారు. కళాశాల సంచాలకులు డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవడం, భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలుగు భాషను కేవలం ఒక పాఠ్యాంశంగా కాకుండా, మన జీవన విధానంలో భాగంగా భావించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి పిలుపునిచ్చారు. విద్యార్థులు తెలుగు భాష, సాహిత్యం మరియు సంస్కృతిపై ఆసక్తిని పెంపొందించుకొని తెలుగు భాషా పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పద్యం- గద్యం పోటీ నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిధి చేతులమీదుగా బహుమతి ప్రధానం చేసారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను సభ్యులు అందరు ఆలపించారు. ఈ కార్యక్రమం కళాశాల గ్రంధాలయ అధికారిని డాక్టర్ లెంక సత్యవతి, లెఫ్టనెంట్ మజ్జి వరలక్ష్మి, సహాయ ఆచార్యలు శ్రీ గుంట్రెడ్డి రవి ప్రసాద్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, గ్రంధాలయసిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని తెలుగు భాషా దినోత్సవాన్ని విజయవంతం చేశారు. Spread the love టపా నావిగేషన్ విజయనగరం పట్టణంలో నూతన రైతు బజార్‌కు శంకుస్థాపన