సాలూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో సాలూరు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం జంక్షన్ వద్ద మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. “ఈరోజు మనం ఒక గొప్ప సంకల్పం తీసుకుందాం.. మట్టి గణపతినే పూజిద్దాం.. మన పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అని మంత్రి సంధ్యారాణి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి, పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని సూచించారు. పండుగ అనేది కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాకుండా సమాజం, ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తుచేసే సందర్భమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పలువురు భక్తులు మట్టి విగ్రహాలను స్వీకరించి పర్యావరణహితంగా వినాయక చవితిని జరుపుకుంటామని తెలిపారు… Spread the love టపా నావిగేషన్ బేబీ నాయన చేతుల మీదుగా పారాది లో సాఫ్ట్ బాల్ క్రీడా సందడి