ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 6వ జిల్లా మహాసభలు శనివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగాయి. జిల్లా అధ్యక్షులు కె.రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా జిల్లా ప్రధాన కార్యదర్శి వ్యాసుబాబు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఎపిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిజం వృత్తి సంక్షోభంలో ఉందని, ఈ నేపథ్యంలో మనం వృత్తిని కాపాడుకోవలసిన అవసరం ఉందని అన్నారు. సమాచారం సేకరించి వార్త రాసే జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం డేటా ప్రైవసీ యాక్టు తెచ్చి జర్నలిస్టుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రస్తుత రోజుల్లో జర్నలిస్టుల కంటే ఇన్ ఫ్లూయనర్సు ప్రభావం ఎక్కువైందన్నారు. వారు ఇచ్చిన సమాచారంతోనే మనం వార్త రాయాల్సి వస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఎస్పీ, కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్సులకు కూడా మనల్ని పిలవని రోజులు రాబోతున్నాయన్నారు. సమాచార శాఖను కూడా కుదించేస్తున్నారన్నారు. కొత్త పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. మార్చిలో ఎపిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యాన చేపట్టిన ర్యాలీ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కొన్నింటిని అమలు చేసిందన్నారు. ఆరోగ్య బీమా రెన్యువల్ కు ఏప్రిల్లో జీఓ వచ్చే విధంగా చేయగలిగామన్నారు. జర్నలిస్టులు అవార్డులకు జీఓ రావడానికి కారణం మనం కూడా మన యూనియన్ అని చెప్పారు. ఇంకా కలిసికట్టుగా పోరాడి ఇళ్ల స్థలాలు, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలను సాధించుకోవాల్సి ఉందని తెలిపారు. అందుకు జర్నలిస్టులంతా కలసికట్టుగాప్రభుత్వాలు, పాలకులపై ఒత్తిడి తేవాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లోను ప్రజాప్రతినిధులను, అధికారులకు కలసి వినతులు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఎపిడబ్ల్యుజెఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఎపిడబ్ల్యుజెఎఫ్ సుదీర్ఘం కాలం పాటు అత్యధికంగా వర్కింగ్ జర్నలిస్ట్ లు కలిగిన సంఘం అన్నారు. ప్రభుత్వం ఫెడరేషను, బ్రాడ్ కాస్టింగ్ యూనియన్ ను గుర్తించిందని తెలిపారు. జర్నలిస్టులు సమస్యలు, హక్కుల కోసం పోరాటంలో మన సంఘం ముందుందన్నారు. రాజకీయ విలువలు లేని స్థితిలో నచ్చితే ఒకటి, నచ్చకపోతే మరోలా ప్రచారం చేసి మన మధ్య ఐక్యతను విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ధర్నా సందర్భంగా వినతి పత్రంలో పేర్కొన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.
జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ అధికారి పి.గోవిందరాజులు మాట్లాడుతూ ఫెడరేషన్ నాయకులు జర్నలిస్టులకు మంచి సేవలు అందిస్తున్నారని తలెఇపారు. జర్నలిస్టులకు శాఖాపరంగా తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. రాష్ట్ర నాయకులు ఎన్.మధుసూదనరావు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులను ఐక్యంగా ఉంచి సమస్యల పరిష్కారానికి ఎపిడబ్ల్యుజెఎఫ్ పని చేస్తుందన్నారు. చిన్నా,మధ్య, పెద్ద పత్రికలని సంబంధం లేకుండా అందరి సమస్యల కోసం పని చేయడం మన కర్తవ్యమని తెలిపారు. జర్నలిస్టులపై దాడులను ప్రభుత్వాలు నివారించాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి భీమారావు మాట్లాడుతూ మనం శాశ్వతమైన హక్కుల కోసం ప్రయత్నం చేయాలన్నారు. జర్నస్టులకు రావలసిన న్యాయపరమైన హక్కులు కోసం ఐక్యతగా పోరాడాలని కోరారు. జిల్లా అధ్యక్షులు కె.రమేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక అతిపెద్ద సంఘం ఎపిడబ్ల్యుజెఎఫ్ అని అన్నారు. జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అటువంటి కుటిల యత్నాలు తిప్పికొట్టి ఐక్యంగా మన హక్కుల కోసం, సమస్యల పరిష్కారానికి కలసికట్టుగా పోరాడుతామని తెలిపారు. సభలో విశాఖ జిల్లా నాయకులు నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా అప్పారావు , శివకేశవనాయుడు,
ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా మహా సభ సందర్భంగా 14 మందితో జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైంది. జిల్లా అధ్యక్షులుగా సిహెచ్ శివ కేశవ నాయుడు (ఆంధ్రజ్యోతి), ప్రధాన కార్యదర్శిగా పి.అప్పారావు (ప్రజాశక్తి), కోశాధికారిగా రెడ్డి నాగరాజు ( ఫ్రీలాన్స్ జర్నలిస్టు) ఎన్నికయ్యారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా ఆర్.వ్యాస్ బాబు(సాక్షి), ఉపాధ్యక్షులుగా పతివాడ రమణ (ఆంధ్రజ్యోతి), జి.సత్యసాయి, బి.ప్రసాదరావు (ప్రజాశక్తి), సహాయ కార్యదర్శులుగా ఎ.తిరుపతిరావు (ప్రజాశక్తి), కె.సత్యనారాయణ, దూరి సురేష్ (ఆంధ్రజ్యోతి), ఆర్.బాబూరావు (ఆంధ్రపత్రిక), కార్యవర్గ సభ్యులుగా పాండ్రంకి అప్పలనాయుడు(ఆంధ్రజ్యోతి), వి.నాగరాజు(ప్రజాశక్తి), ఆర్ విఎజి ప్రసాద్ (ఆంధ్రప్రభ) ఎన్నికయ్యారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి