*స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి* –అధికారులకు జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి ఆదేశాలు విజయనగరం, అక్టోబర్ 15: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికల నిర్వహణపై ఎంపీడీవోలు, ఆర్డీవోలు, సంబంధిత అధికారులతో ఒక విడత, మున్సిపాలిటీల ఎన్నికల ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్లతో మరో విడత టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల జాబితాలు, ఏఎస్డీడీ జాబితాల పరిశీలన, పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్రిటికల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన పోలింగ్ అధికారులు, నోడల్ అధికారులు, రూట్ అధికారులు, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ల నియామక ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ను సిద్ధం చేసుకోవడంతో పాటు బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన కాగితం, ప్రింటింగ్ ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల ఏర్పాట్లు, కమ్యూనికేషన్ ప్లాన్, అవసరమైన వాహనాల సమీకరణపై ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల స్వీకరణ, తక్షణ స్పందన కోసం కంట్రోల్ రూమ్తో పాటు హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడంతో పాటు, నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే లోపలికి అనుమతి ఇవ్వాలని, నామినేషన్ కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో ఒక వాహనానికి మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. నామినేషన్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయడంతో పాటు అవసరమైన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక అవసరాలు గల ఓటర్ల సౌకర్యార్థం వీల్చైర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల విధులపై సంబంధిత సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ ధరణి పేరుతో నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యం తక్కువ ధరకే అందుబాటులోకి