పార్వతీపురం, మక్కువ, జనవరి 25: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, సంబర గ్రామ దేవత శ్రీ సంబర పోలమాంబ జాతరను పురస్కరించుకొని ఎక్సైజ్ శాఖ నిఘా పెంచింది. జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి నేతృత్వంలో ఆదివారం సరిహద్దు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన రైవలస (తిమ్మడపాక గ్రామం) వద్ద ఎక్సైజ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో సుమారు 120 లీటర్ల నాటు సారాను అధికారులు సీజ్ చేశారు. ఈ దాడులు ఒడిశా ఎక్సైజ్ శాఖ సమన్వయంతో జరిగాయి. ఈ ఘటనపై ఒడిశాలోని నారాయణ పట్నం ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
ఈ సంయుక్త దాడుల్లో ఒడిశా ఎక్సైజ్ టీం (నారాయణ పట్నం), ESTF బృందం (పార్వతీపురం), బీఎంపీపీ (BMPP) (సాలూరు), ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది (సాలూరు) ఉన్నారు. జాతర సమయంలో అక్రమ మద్యం రవాణా, నాటు సారా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, సరిహద్దుల్లో నిరంతరం నిఘా కొనసాగుతుందని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

