పార్వతీపురం, మార్చి 16 : పార్వతీపురం మన్యం జిల్లాలో జర్నలిజం నాణ్యతను పెంచేలా వార్తలు ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, పొరుగు జిల్లాల కంటే భిన్నంగా, నాణ్యమైన జర్నలిజం ఉండాలని ఆకాంక్షించారు. నెగటివ్ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే, వ్యవస్థను మెరుగుపరిచేలా మరియు ప్రజలకు ఉపయోగపడేలా వార్తా కథనాలు ఉండాలని సూచించారు.జిల్లా మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మంజూరు చేసిన 196 కార్డులను కలెక్టర్ మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ మరియు ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి సారించి మంచి వార్తలను అందించాలని కోరారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో, అదే రీతిలో జర్నలిజం మరియు సమాచార శాఖ కూడా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రకటనల్లో అక్షర దోషాలు, వాక్య నిర్మాణ దోషాలు మరియు సందర్భోచిత లోపాలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా లోపాలు జరిగినప్పుడు లేదా నెగిటివ్ వార్తలు వచ్చినప్పుడు, సంబంధిత అధికారి వివరణను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. కేవలం ఆఫీసర్ వెర్షన్‌తోనే వార్తను రాస్తే అది సమగ్రంగా ఉంటుందని హితవు పలికారు. మంచి పనులు జరిగినప్పుడు వాటిని ప్రజలకు తెలిసేలా సానుకూల దృక్పథంతో రాయడం ముఖ్యమని, పత్రికా ప్రకటనలు రాసే వారికి, రిపోర్టర్లకు జర్నలిజం సూత్రాలపై ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఈ సందర్బంగా అసోసియేషన్లను కోరారు. ప్రస్తుతం చాలా మందికి తప్పులను సరిదిద్దుకునే సరైన విధానం తెలియకపోవడం వల్ల పాత పద్ధతుల్లోనే వార్తలు పంపిస్తున్నారని, శిక్షణ తరగతులు నిర్వహించడం వలన వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయన్నారు. తప్పులను సరిదిద్దడానికి మరియు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి ఒక వాట్సాప్ గ్రూప్ లేదా ఫోరమ్ ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు. ఇందులో ఎవరైనా తప్పులు చేస్తే, ఇతరులు వాటిని సరిదిద్దడం ద్వారా అందరికీ అవగాహన వస్తుందని వివరించారు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే జర్నలిజం పట్ల ప్రత్యేక దృష్టి సారించి, సమాజంలో ఉండే లోపాలను ఎత్తిచూపాలని, సమస్యకు పరిష్కారం లభించేలా జర్నలిస్టులు ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. బాలమన్ సింగ్, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఎం.గజపతిరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి జి.వి.రవికుమార్, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సమాచార శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ రాష్ట్ర వైసీపీ వాలంటీర్ల విభాగం కార్యదర్శిగా సాలూరు పట్టణానికి చెందిన సిద్దాబత్తుల.రుద్ర ప్రశాంత్