సునీత రెడ్డి విజయనగరం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, రేగడి ఆముదాలవలస పోలీసు స్టేషనులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ జూన్ 13న సందర్శించి, పోలీసు స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో మహిళల భద్రత, గంజాయి నిర్మూలనకే తొలి ప్రాధాన్యత కల్పించే విధంగా రక్షణ, నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ – గంజాయి నియంత్రణ, మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యత కల్పించాలని, క్షేత్ర స్థాయిలో మహిళల సంరక్షణ, గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. మహిళల భద్రతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మహిళల భద్రతకు, గంజాయి నియంత్రణకు పోలీసుశాఖ చేపడుతున్న చర్యలను, అవగాహన కల్పించేందుకు రూపొందిస్తున్న షార్ట్ ఫిల్మ్స్, సోషల్ మీడియా పోస్టులను, ప్రచురించిన పత్రాలను, గోడ పత్రికలను ప్రజలకు చేరే విధంగా చూడాలన్నారు.

అవగాహన కార్యక్రమాలు నిర్వహించే క్రమంలోనే ప్రజలకు సైబరు భద్రత, రహదారి భద్రత, హెల్మెట్ ధారణ, వాట్సాప్ వీడియో కాల్ అరెస్టు పట్ల కూడా అవగాహన కల్పించాలన్నారు. క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాల నిర్వహణ, సమాచార సేకరణలో దత్తత గ్రామాల పోలీసు సిబ్బంది మరింత క్రియాశీలకంగా పని చేయాలన్నారు. నేరాలనియంత్రణకు ఎప్పటికప్పుడు లాడ్జిలు, వాహన తనిఖీలను ఆకస్మికంగా చేపట్టాలని, రికార్డులను పరిశీలించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు, లాడ్జి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎం.ఎస్.పి.లు, శక్తి బృందాలు తరుచూ స్కూల్స్, కళాశాలలు సందర్శించి మహిళల భద్రత, రక్షణ పట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రైమరీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధిని, విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి తెలపాలన్నారు. రహదారి ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లును ఏర్పాటు చేయాలని, రాత్రి సమయాల్లో స్టాపర్లు కనిపించే విధంగా వాటిపై రేడియం స్టిక్కర్లును అతికించాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో దర్యాప్తు, సాక్షుల విచారణ, నిందితుల అరెస్టు వంటి వివరాలను ఎప్పటికప్పుడు సి.సి.టి.ఎన్.ఎస్.లో అప్ లోడ్ చేయాలన్నారు. పోలీసుశాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వాటిని షేర్ చేయాలని అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీసు స్టేషను ప్రాంగణాల్లో సీజ్ చేసిన వాహనాలను నిబంధనలు మేరకు వాటి యజమానులకు అప్పగించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపైన, డ్రంకన్ డ్రైవ్ చేసిన వారిపైన, ఎం.వి.నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనా ఎన్ఫోర్సుమెంటు కేసులు నమోదు చేయాలన్నారు. గతంలో విధించిన ఈ-చలానాలను వాహనదారులు చెల్లించే విధంగా ఎప్పటికప్పుడు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.

పురుష మరియు మహిళా పోలీసు సిబ్బంది వేరువేరుగా వేచి ఉండేందుకు నెల్లిమర్ల పోలీసు స్టేషను ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రెండు రెస్ట్ రూంలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అనంతరం, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ స్వయంగా స్వీట్స్ ను అందజేసి, ఏ సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చునన్న భరోసాను కల్పించారు. ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు కార్పొరేట్ వైద్యం పొందేందుకు ప్రతీ పోలీసు ఉద్యోగి ఎస్.బి.ఐ. హెల్త్ ఇన్సూరెన్సు చేయించుకోవాలన్నారు. అదే విధంగా పోలీసు సిబ్బంది జన్మదినం, వివాహ వార్షికోత్సవం రోజుల్లో వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు పెర్మిషన్స్ మంజూరు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.

ఈ తనిఖీల్లో చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, చీపురుపల్లి సీఐ జి.శంకరరావు, నెల్లిమర్ల ఎస్ఐ గోపాలరావు, గుర్ల ఎస్ఐ పి.నారాయణరావు, గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు, రేగిడి ఆముదాలవలస ఎస్ఐ బాలకృష్ణ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి