*యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు*

*ఉపాధి వేతనదారులతో ఘనంగా యోగా ప్రదర్శన*

విజయనగరం, (బొండపల్లి), జూన్ 14 :
యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యంతో బాటు ఆనందం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో యోగా ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలోని అంకన్న చెరువు వద్ద “యోగాంధ్ర” థిమేటిక్ యోగా కార్యక్రమాన్ని ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా పాల్గొని పలు యోగాసనాలు వేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అంకన్న చెరువు గట్టు పైన అర కిలోమీటరు మేర వేలాదిమంది ఉపాధి హామీ వేతనదారులు ఒకేసారి ఆసీనులై యోగాసనాలు వేయడం విశేషంగా నిలిచింది.

*యోగా పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరం*
మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశంలో మన పూర్వీకులు మానవాళికి అందించిన అత్యంత గొప్ప వరం యోగా అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో తాను సైతం యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేయడం ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకున్నానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి స్పష్టం చేశారు. వందలాది మంది ఒకేచోట చేరి యోగాలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, కేవలం ఈ ఒక్క రోజే కాకుండా ఇదే ఒరవడిని ప్రతి నిత్యం జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నిరంతరం ఇంటి పనులతో అలసిపోయే మహిళలు, యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ప్రశాంతతను పొందవచ్చని మంత్రి సూచించారు.

*శరీరాన్ని, మనస్సును ఆహ్లాదపరిచేదే యోగా*
కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి

జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. మానవ శరీరాన్ని, మనస్సును ఒకేసారి ఆహ్లాదపరిచే అద్భుత శక్తి యోగాకు మాత్రమే ఉందన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గజపతినగరం ఏఎంసీ చైర్మెన్ గోపాలరాజు, వైస్ ఛైర్మన్ కోరాడ కృష్ణ, డిఆర్డిఎ పిడి శ్రీనివాస పాణి, డ్వామా పిడి శారదాదేవి, జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, యోగా నోడల్ ఆఫీసర్ డాక్టర్ వరప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మండల అధికారులు, నాయకులు, డ్వామా, డీఆర్డీఏ, ఆయుష్ అధికారులు, భారీ సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి