సాలూరు, సెప్టెంబర్ 8 (9 న్యూస్): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కురుకూటి గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సాగు పట్టాలు మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి కె. మన్మధరావు, సాలూరు నియోజకవర్గ కార్యదర్శి బలగ రాధానాయుడు హెచ్చరించారు.

మంగళవారం గ్రామంలో బలగ రాధానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా కురుకూటి ప్రాంతంలోని గిరిజనులు సుమారు 240 ఎకరాల భూమిని సాగు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు వారికి పట్టాలు మంజూరు కాకపోవడం అన్యాయమన్నారు.

గిరిజన రైతుల భూములను సర్వే చేసి, అర్హులైన వారికి వెంటనే సాగు హక్కు పత్రాలు, పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యూత్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కోరంగి గోపి నాయుడు, మాజీ సర్పంచ్ అప్పారావు, సీపీఐ నాయకులు సన్యాసిరావు, సుబ్బారావు, పరమేశు, ఎస్. బుచ్చయ్య, అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి