విజయనగరం, ఆగస్టు 11: తల్లి–బిడ్డల ఆరోగ్యం, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి అన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల సురక్షిత ప్రయాణం కోసం అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన 11 నూతన ‘102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను మంగళవారం కలెక్టరేట్ పోర్టికో వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులను ఆసుపత్రి నుంచి సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవల ద్వారా ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన తల్లులు, శిశువులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. తల్లి–బిడ్డల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నూతన వాహనాల్లో ఎయిర్‌బ్యాగులు, సీట్‌బెల్టులు తదితర అధునాతన భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో తల్లితో పాటు ఇద్దరు సహాయకులు లేదా కుటుంబ సభ్యులు కూడా ఈ వాహనంలో ప్రయాణించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
అధిక ప్రమాదం ఉన్న గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో రక్తమార్పిడి అవసరమైన వారికి ప్రత్యేకంగా పికప్, డ్రాప్‌-బ్యాక్‌ సేవలను కూడా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. జీవనరాణి కలెక్టర్‌కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో నమోదవుతున్న ప్రసవాల సంఖ్య ఆధారంగా మొత్తం 500 ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను కేటాయించగా, విజయనగరం జిల్లాకు కొత్తగా 11 వాహనాలు మంజూరయ్యాయి. వీటిలో 8 వాహనాలను విజయనగరంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి, 2 వాహనాలను ఏరియా ఆసుపత్రులకు, 1 వాహనాన్ని బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించారు. కాగా, జిల్లాలో ఇప్పటికే 22 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను పొందేందుకు 24 గంటలూ పనిచేసే 102 లేదా 108 కాల్‌ సెంటర్‌ను సంప్రదించవచ్చునని తెలిపారు. అవసరమైన సమయంలో గర్భిణులు, బాలింతలకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారులు తెలిపారు. తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలో మాతా, శిశు మరణాలను గణనీయంగా తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జీవనరాణి, డి.సి.హెచ్.ఎస్. డా. పద్మశ్రీ, జి.జి.హెచ్. సూపరింటెండెంటు డా. అల్లు పద్మజ, ఎన్.టి.ఆర్. ఆరోగ్య సేవల జిల్లా కన్వీనర్ డా. సాయిరాం, అదనపు డి.ఎం.అండ్.హెచ్.ఒ. డా. కె. రాణి, డిప్యూటి డి.ఎం.అండ్.హెచ్.ఒ. డా. సూర్యనారాయణ, డిప్యూటి హెచ్.ఇ.ఒ. చాముండేశ్వరి, ఎ.ఓ. వెంకటరాజు, వైద్యాధికారులు, ఐ.సి.డి.ఎస్. అధికారులు, 102/108 సేవల ప్రతినిధులు, ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి