*ప్రజల భాగస్వామ్యంతోనే పి.హెచ్.సి ముస్తాబు విజయవంతం*

*జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి*

*వైద్యారోగ్య కేంద్రాలు ప్రజలకు దేవాలయాల్లాంటివి*

*ఆర్.ఆర్.బి పురం పి.హెచ్.సి అభివృద్ధి అభినందనీయం*

*నీతి ఆయోగ్ మేగజైన్‌లో మన జిల్లా అభివృద్ధి నమూనాలు ప్రచురితం*

పార్వతీపురం, మార్చి 18: ప్రభుత్వ నిధులపైనే కాకుండా ప్రజల భాగస్వామ్యం, స్థానిక నాయకుల సహకారంతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పి.హెచ్.సి) కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే ‘పి.హెచ్.సి ముస్తాబు’ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. బుధవారం జీయ్యమ్మవలస మండలం ఆర్.ఆర్.బి పురం పి.హెచ్.సి ప్రాంగణంలో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లతో ‘ముస్తాబు’ మరియు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోనే తొలి ముస్తాబు పీహెచ్‌సీగా ఆర్.ఆర్.బి పురం నిలిచిందని జిల్లా కలెక్టర్ కొనియాడారు. పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి అంటే కేవలం వైద్య సేవలు అందించడమే కాదని, ప్రాంగణం ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉండేలా వాతావరణం కనిపించాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆవరణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన వైద్యులు సుస్మిత, దిలీప్ లను కలెక్టర్ ఈ సందర్బంగా అభినందించారు.  ఈనేపథ్యంలో ఆవరణ వెనుక భాగంలో పలు రకాల మొక్కలు, చుట్టూ కంచె, కుర్చీలు ఏర్పాటుతో ఆసుపత్రి ఆవరణ ఉద్యానవనాన్ని తలపిస్తోందని కితాబిచ్చారు. మొట్టమొదటిసారిగా ముస్తాబైన ఈ పీహెచ్‌సీని స్ఫూర్తిగా తీసుకుని, జిల్లాలోని మిగిలిన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఇదే రీతిలో ముస్తాబు కావాలని పిలుపునిచ్చారు. వైద్యారోగ్య కేంద్రాలు ప్రజలకు దేవాలయాల్లాంటివని అన్నారు. సొంత నిధులతో అభివృద్ధి: పి.హెచ్.సి అభివృద్ధికి కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా, స్థానిక దాతలు, నాయకుల భాగస్వామ్యంతో మొక్కల పెంపకం, మౌలిక వసతుల కల్పన వంటి పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి పి.హెచ్.సి పరిధిలోని పాఠశాల విద్యార్థులను నెలకు ఒకసారి ఆసుపత్రికి ఆహ్వానించి, అక్కడ లభించే ఉచిత వైద్య సేవలు, పరీక్షల గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రత, వైద్య సేవల నాణ్యతపై ప్రత్యేక చెక్‌లిస్ట్ రూపొందించామని, దాని ప్రకారం అన్ని పారామీటర్లు ఖచ్చితంగా అమలు కావాలని స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది ఎంతో ఓపికతో, మర్యాదగా వ్యవహరించాలని, వారి నమ్మకాన్ని చూరగొనాలని తెలిపారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలను నాటారు.

స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ముస్తాబుతో మారిన పీహెచ్‌సీల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చేపట్టిన ‘ముస్తాబు’ కార్యక్రమంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయని కొనియాడారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులంటే ఉన్న అపోహలను తొలగిస్తూ, నేడు కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా వసతులు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేవలం భవనాలకు రంగులు వేయడమే కాకుండా, రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుభ్రత, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. పీహెచ్‌సీ ప్రాంగణంలో పచ్చదనం, స్వచ్ఛమైన గాలి రోగులకు త్వరితగతిన కోలుకునేలా మానసిక ధైర్యాన్ని ఇస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రవేశపెట్టిన ‘గ్రామ ముస్తాబు’, ‘ఫ్యామిలీ ముస్తాబు’ స్ఫూర్తితో ఇప్పుడు పీహెచ్‌సీలు కూడా ఆధునీకరించబడ్డాయని తెలిపారు. ఆసుపత్రిని ఇంత చక్కగా తీర్చిదిద్దిన మెడికల్ ఆఫీసర్లకు, సిబ్బందికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఈ మెరుగైన వైద్య సేవలను వినియోగించుకోవాలని, ప్రతి పీహెచ్‌సీ ఇదే విధంగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,కలెక్టర్ నేతృత్వంలో జిల్లాలో అమలవుతున్న నాలుగు కీలక అభివృద్ధి నమూనాలు జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ మేగజైన్‌లో ప్రచురితం కావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ, సుస్థిరమైన ఫలితాలు సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. భాస్కరరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండల రావు, వైద్యశాఖ అధికారులు కె.వి.ఎస్ పద్మావతి, కె.విజయపార్వతి, వై. విజయమోహన్, టి.జగన్మోహన రావు,ఎం.వినోద్ కుమార్,శివ కుమార్,సూర్యకౌశిక్, పిహెచ్సీ వైద్యాధికారులు కె.సుష్మిత, జె.దిలీప్ కుమార్, ఏపిఎన్జీఓ జిల్లా ప్రెసిడెంట్ జి.వి.వి. కిషోర్, పిహెచ్సీ డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి