వ ిజయనగరం జిల్లా గంట్యాడ మండలం, లక్కిడం జంక్షన్ వద్ద రోడ్డు ప్రక్కనే ఉన్న ఇండియా 1 ఎ.టి.ఎం. చోరీ జరిగిన ఘటన స్థలాన్ని, చుట్టు ప్రక్క ప్రాంతాలను జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* గారు ఆగష్టు 5న సందర్శించి, నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఏటీఎం కేంద్రం పరిసరాలను పరిశీలిస్తూ చోరీ జరిగిన విధానం, నిందితులు అనుసరించిన పద్ధతి, వారు ఉపయోగించిన మార్గాలు, సాంకేతిక అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి, కేసును చేధించేందుకు అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారు మాట్లాడుతూ – గంట్యాడ మండలం, లక్కిడం జంక్షన్ వద్ద ఆగష్టు 5న తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు రోడ్డు ప్రక్కనే ఉన్న ఇండియా 1 ఏ.టి.ఎం.లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి ఏ.టి.ఎం.ను దొంగలించారన్నారు. దొంగలించిన ఏ.టి.ఎం.ను త్రాడుతో బొలెరో వాహనానికి కట్టి కొంత దూరం లాక్కేల్లినట్టు ప్రాధమిక దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఏ.టి.ఎం.లో సుమారు రూ.1,50,000/- వరకు నగదు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైందని, నేర స్థలంను ఇప్పటికే క్లూస్ టీమ్ పరిశీలించిందని, ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించామన్నారు. నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ నేరంను చేధించేందుకు సి.సి.ఎస్. పోలీసులు, నేరాలను చేధించుటలో నిష్ణాతులైన ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది సుమారు 50మందితో 10 బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు విజయనగరం ఇంచార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో పని చేస్తాయని, బృందాలను సిఐ లేదా ఎస్ఐ నాయకత్వం వహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. అలాగే ఏటీఎం కేంద్రంలోని సీసీటీవీ దృశ్యాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార సముదాయాలు, రహదారుల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను కూడా సేకరించి విశ్లేషిస్తున్నామని తెలిపారు. అవసరమైన చోట సాంకేతిక నిపుణుల సహకారంతో డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దర్యాప్తు అధికారులు ప్రతి చిన్న ఆధారాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలని, జిల్లా సరిహద్దులతో పాటు పొరుగు జిల్లాల పోలీసులతో సమన్వయం పెంచి నిందితుల కదలికలపై నిఘా ఉంచాలని, MO క్రిమినల్స్ ను విచారించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. అనుమానితుల వివరాలు, వాహనాల సంచారం, మొబైల్ సాంకేతిక సమాచారం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏటీఎం కేంద్రాల భద్రత విషయంలో బ్యాంకు యాజమాన్యాలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. అన్ని ఏటీఎంలలో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు, అలారం వ్యవస్థలు, తగినంత లైటింగ్, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీసు స్టేషన్కు లేదా డయల్-100/112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని, నేరాలకు పాల్పడే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ వెంట గంట్యాడ ఎస్ఐ డి.సాయి కృష్ణ, సి.సి.ఎస్. సిఐ డి.డి.నాయుడు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు మరియు సిబ్బంది ఉన్నారు. Spread the love టపా నావిగేషన్ శాంతిభద్రతల పరిరక్షణలో మీ సేవలు అభినందనీయం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్