విజయనగరం | సెప్టెంబరు 2, 2026 విజయనగరం జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన, నెల్లిమర్ల మండలం చినమల్లుపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కే. రాజేష్‌కు సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘన సత్కారం లభించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుధవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన రాజేష్ సెప్టెంబరు 5న న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా తన ప్రయాణం, బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా వినియోగించేందుకు స్ఫూర్తినిచ్చిన అంశాలను వివరించారు. సాంకేతిక సాధనాలను సమర్థంగా ఉపయోగించడం ద్వారా బోధనను మరింత ఆసక్తికరంగా, పరస్పర భాగస్వామ్యంతో, ప్రయోజనకరంగా మార్చవచ్చన్నారు. మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, వినూత్న బోధనా పద్ధతులను అవలంబించాలని సూచించారు. విద్యార్థులు జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, తమలోని ప్రతిభను గుర్తించి, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో లక్ష్యసాధనకు కృషి చేయాలని రాజేష్ సూచించారు. విజయానికి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో కీలకమని, అందువల్ల ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి సూచనలను పాటించాలని పిలుపునిచ్చారు. విద్యలో సాంకేతికత, సృజనాత్మకత, నిబద్ధతకు ప్రాధాన్యమిస్తూ రాజేష్ చేస్తున్న కృషి అభినందనీయమని కళాశాల యాజమాన్యం పేర్కొంది. ఆయనతో జరిగిన ముఖాముఖి విద్యార్థులు, అధ్యాపకుల్లో స్ఫూర్తిని నింపింది. కార్యక్రమంలో సత్య గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి దేవమణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని రాజేష్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. Spread the love టపా నావిగేషన్ సీతం కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం